రైతు బంధు పంపిణీకి ఈసీ బ్రేక్ .. నాలుగు రోజుల కింద ఇచ్చిన అనుమతులు వెనక్కి

రైతు బంధు పంపిణీకి  ఈసీ బ్రేక్ .. నాలుగు రోజుల కింద ఇచ్చిన అనుమతులు వెనక్కి
  • మంత్రి హరీశ్​రావు కామెంట్లతోనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • పబ్లిసిటీ చేయొద్దని చెప్పినా ఆయన పట్టించుకోలేదని ఫైర్​
  • ఎన్నికల ప్రక్రియను మంత్రి భంగపరిచారని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: రైతు బంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. యాసంగి సీజన్ కోసం రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు నాలుగు రోజుల కింద ఇచ్చిన అనుమతిని సోమవారం రద్దు చేసింది.  రైతుబంధుపై ఎలాంటి పబ్లిసిటీ చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ మంత్రి హరీశ్​రావు ప్రచార కార్యక్రమాల్లో చేసిన కామెంట్ల కారణంగానే అనుమతిని రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర  ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కి లేఖ రాసింది. రైతుబంధు నిధులు విడుదల చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

రైతుబంధు ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కావడం వల్ల యాసంగిలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆ మధ్య రాష్ట్ర ప్రభుత్వం  ఈసీని అనుమతి కోరింది. దీంతో ఈ నెల 24న షరతులతో కూడిన అనుమతులను ఈసీ మంజూరు చేసింది. కొత్త లబ్ధిదారులను చేర్చవద్దని, రైతుబంధు పంపిణీ విషయంలో పబ్లిసిటీ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయొద్దని అందులో స్పష్టంగా పేర్కొంది. ఈ నెల 29, 30 తేదీల్లో మాత్రం రైతుబంధు నగదును పంపిణీ చేయొద్దని తెలిపింది.

అయితే ఈసీ అనుమతి ఇచ్చిన తర్వాత మంత్రి హరీశ్​రావు ప్రచార ర్యాలీలో, సభలో మాట్లాడుతూ..  రైతుబంధు డబ్బులు సోమ వారం ఉదయం టీ, టిఫిన్లు పూర్తి చేసుకునే లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, టింగ్​ టింగ్​మని ఫోన్లకు మెసేజ్​లు వస్తాయని మాట్లాడారు. ఈ కామెం ట్స్​ను ఈసీ సీరియస్​గా తీసుకుంది. కంప్లయింట్స్​ అందడంతో పాటు వార్త పత్రికల ద్వారా విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. 

హరీశ్​రావు మంత్రిగా కొనసాగడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట బరిలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి అని, అలాగే ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా కూడా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిం చడమే కాకుండా  ఎన్నికల ప్రక్రియను భంగపరిచిన ట్లుగా భావిస్తున్నామని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందువల్లే రైతుబంధు పంపిణీ చేపట్టొద్దని ఆదేశిస్తు న్నట్లు స్పష్టం చేసింది.