మున్సిపోల్స్‌‌కు గెట్‌‌ రెడీ… కలెక్టర్లకు ఈసీ నాగిరెడ్డి ఆదేశం

మున్సిపోల్స్‌‌కు గెట్‌‌ రెడీ… కలెక్టర్లకు ఈసీ నాగిరెడ్డి ఆదేశం

నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌‌

నవంబర్‌‌ తొలివారంలో నోటిఫికేషన్‌‌!

ఒకే దశలో పోలింగ్‌‌.. ఒక రోజు తర్వాత కౌంటింగ్‌‌

కౌన్సిలర్‌‌ క్యాండిడేట్ల ప్రచార ఖర్చు రూ. లక్ష

కార్పొరేటర్‌‌ అభ్యర్థులకు రూ. లక్షన్నర

మున్సిపల్‌‌ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌ నాగిరెడ్డి ఆదేశించారు. మున్సిపోల్స్‌‌పై హైకోర్టు సింగిల్‌‌ జడ్జి దగ్గర విచారణ ఈ నెల 31న ముగిసే అవకాశముందని, ఎన్నికలకు కోర్టు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కోర్టు ఓకే అంటే నవంబర్‌‌ తొలి వారంలోనే నోటిఫికేషన్‌‌ ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. కలెక్టర్లు, జిల్లా అధికారులతో నాగిరెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. కోర్టు అనుమతించిన 2, 3 రోజుల్లో వార్డుల వారీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఈసీకి మున్సిపల్‌‌ శాఖ నివేదికివ్వొచ్చని, ఆ వెంటనే నోటిఫికేషన్‌‌ ఇస్తామని ఆయన తెలిపారు. నోటిఫికేషన్‌‌ నుంచి 15వ రోజు పోలింగ్‌‌ నిర్వహిస్తామని, పోలింగ్‌‌ తర్వాత రోజును రీ పోలింగ్‌‌కు రిజర్వ్‌‌ డేగా ఉంచి ఆ మరుసటి రోజు ఎన్నికల కౌంటింగ్‌‌ నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు పోలింగ్‌‌ నిర్వహిస్తామని, ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రచారం ఖర్చు కౌన్సిలర్‌‌ అభ్యర్థులకు రూ. లక్ష, కార్పొరేటర్‌‌ అభ్యర్థులకు రూ. లక్షన్నరగా నిర్ణయించినట్టు తెలిసింది.

గుర్తులు ఫైనల్‌‌ చేయగానే..

ఎన్నికల నిర్వహణకు జిల్లాల వారీ సన్నద్ధతను త్వరగా ఈసీకి నివేదించాలని కలెక్టర్లకు నాగిరెడ్డి సూచించారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, నోటిఫికేషన్‌‌ వచ్చాక మరోసారి ఇవ్వాలన్నారు. పోలింగ్‌‌ స్టేషన్ల వారీగా ఎంత మంది భద్రత సిబ్బంది అవసరమో లెక్క తేల్చాలని చెప్పారు. పోలింగ్‌‌ తర్వాత బ్యాలెట్‌‌ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్‌‌ రూంలను గుర్తించాలని, వాటి భద్రత ఏర్పాట్లపైనా ఈసీకి నివేదించాలని ఆదేశించారు. ఎన్నికల గుర్తులను 2,3 రోజుల్లో ఫైనల్‌‌ చేస్తామని, బ్యాలెట్‌‌ పేపర్​లో క్యాండిడేట్‌‌ పేరుండదు కాబట్టి గుర్తులు ఫైనల్‌‌ చేయగానే పేపర్లు ముద్రించుకోవాలని సూచించారు. పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాడిన బ్యాలెట్‌‌ బాక్సులను పోలింగ్‌‌కు సిద్ధం చేసుకోవాలన్నారు.

ప్రతి 800 మందికి ఓ బూత్‌‌

ఎన్నికలు నిర్వహించే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 3,103 వార్డులున్నాయి. 79,92,434 మంది ఓటర్లున్నారు. ప్రతి 800 మందికి ఒకటి చొప్పున 8,056 పోలింగ్‌‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, స్టేషన్ల గుర్తింపు ప్రక్రియను వెంటనే  పూర్తి చేయాలని నాగిరెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగిన హుజూర్‌‌నగర్‌‌ పరిధిలోని నేరేడుచర్ల, హుజూర్‌‌నగర్‌‌ మున్సిపాలిటీల్లో ఓటర్లకు ఎడమ చేతి మధ్య వేలుకు సిరా చుక్కా పెట్టాలని, మిగతా ప్రాంతాల్లో ఎడమ చేతి చూపుడు వేలుకు పెట్టాలని సూచించారు.

121 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో..

రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే జీహెచ్‌‌ఎంసీతో పాటు గ్రేటర్‌‌ వరంగల్‌‌, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీల కాల పరిమితి ఇంకా ముగియలేదు. జడ్చర్ల, నకిరేకల్‌‌ మున్సిపాలిటీల్లో దగ్గరి ఊర్ల విలీనం, మీర్‌‌పేట కార్పొరేషన్‌‌లో వార్డుల విభజన  పూర్తవలేదు. మందమర్రి, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలు షెడ్యూల్డ్‌‌ ఏరియాలో ఉండటంతో దశాబ్దాలుగా ఎన్నికల నిర్వహణకు సాంకేతిక సమస్యలు అడ్డుపడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో ఎన్నికలు జరిపే అవకాశం లేదు. మిగతా 121 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఈసీ సూచించింది.