న్యూఢిల్లీ : ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత ఆతిశీకి ఎన్నికల కమిషన్ షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. బీజేపీలో చేరాలని.. లేదంటే అరెస్టుకు సిద్ధంగా ఉండాలని బెదిరించారని ఆతిశీ ఏప్రిల్4న ఆరోపించారు. దీనిపై బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఆధారాలు ఇవ్వాలని శుక్రవారం ఈసీ ఆమెకు షోకాజ్ ఇచ్చింది. ‘‘ఒక జాతీయ పార్టీ నాయకురాలిగా, ఢిల్లీ మంత్రిగా ఉన్న మీ మాటలను ప్రజలు విశ్వసిస్తారు. మీడియాలో, సభల్లో చేసే ప్రసంగాలు వారిని ప్రభావితం చేస్తాయి. బీజేపీ మిమ్మల్ని బెదిరించిందని ప్రకటించారు. దానికి సంబంధించిన ఆధారాలు మీదగ్గర ఉన్నాయని భావిస్తున్నాం.. వాటిని మాకు సమర్పించండి. తగిన చర్యలు తీసుకుంటం” అని ఈసీ నోటీసుల్లో ఆదేశించింది.
ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించాలి
తను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఈసీ నోటీసులు ఇవ్వడంపై ఆతిశీ తీవ్రంగా మండిపడ్డారు. ఈసీ.. బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందంటూ ఆరోపించారు. పార్టీలకు అతీతంగా అందరికి సమాన స్థాయిని కల్పించి.. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఈసీ.. ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు దాని నిష్పాక్షికతపై సందేహాలు కలిగిస్తున్నదని విమర్శించారు. ఉదయం 11:45కు తనకు నోటీసులు అందాయని.. కానీ బీజేపీ అంతకంటే చాలా ముందే ఈసీ నోటీసుల విషయం మీడియాకు తెలిపిందన్నారు. నోటీసులకు సమాధానం ఇస్తానని ఆమె చెప్పారు.