ఫేక్ ఓటర్లను ఎలా అనుమతిస్తం?

ఫేక్ ఓటర్లను ఎలా అనుమతిస్తం?

న్యూఢిల్లీ: బిహార్ లో చేపట్టిన ఎలక్టోరల్ రోల్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గట్టిగా సమర్థించారు. ఓటర్లను అణచివేస్తున్నారనే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఈ మేరకు మీడియాతో సీఈసీ మాట్లాడారు.

 ‘‘ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాం. ఓటర్ల లిస్ట్ ను ప్రక్షాళన చేశాం. విమర్శలు, వివాదాలకు భయపడి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేం ఎలా పనిచేయగలం? చనిపోయిన ఓటర్ల పేరుతో నకిలీ ఓట్లను ఎలా అనుమతిస్తాం? 

శాశ్వతంగా వలస వచ్చిన వారు, రెండు ప్రాంతాల్లో ఓటు రిజిస్టర్‌‌‌‌ చేసుకున్న వారు, విదేశీయులతో ఎలా ఓటు వేయిస్తాం? వీటిని అనుమతిస్తే మొదట బిహార్ లో, తర్వాత దేశం మొత్తం నకిలీ ఓట్లు వేయడానికి మార్గం సుగమం అవుతుంది ’’ అని సీఈసీ  పేర్కొన్నారు. 

బిహార్‌‌‌‌ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణలో.. 20 లక్షల మంది ఓటర్లు చనిపోగా, 28 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు వెళ్లారని ఈసీ గుర్తించింది. మరో 7 లక్షల మంది ఓటర్లు రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో రాష్ట్రంలో 56 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించాలని ఈసీ నిర్ణయించింది.