జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఏర్పాట్లు పూర్తి.. ఒక్కో పోలింగ్ స్టేషన్ కు ఒక డ్రోన్..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఏర్పాట్లు పూర్తి.. ఒక్కో పోలింగ్ స్టేషన్ కు ఒక డ్రోన్..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. మంగళవారం ( నవంబర్ 11 ) జరగనున్న ఈ ఎన్నిక కోసం సుమారు నెలరోజులుగా ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఆదివారం ( నవంబర్ 9 ) సాయంత్రంతో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడటంతో నియోజకవర్గ పరిధిలో మైకులన్నీ మూగబోయాయి.. వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్, జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్. 

జూబ్లీ హిల్స్ వెంకటగిరి కాలనీలో పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు అధికారులు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.ఎన్నికకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల కోసం డ్రోన్లు ఉపయోగించనున్నారు అధికారులు. ఎన్నికల నిర్వహణలో  డ్రోన్లు వాడటం ఇదే మొదటిసారి.139 పోలింగ్ లొకేషన్స్ లో 139 డ్రోన్లను వినియోగించనున్నారు అధికారులు.డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయనున్నారు.విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం లో డ్రోన్లను పరిశీలించారు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్

ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహణపై ఎన్నికల సంఘం (ఈసీఐ) నిషేధం విధించింది. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6.30 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. 

ఓటర్లను ఎగ్జిట్ పోల్స్ ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మార్గర్శకాలు జారీ చేసిందన్నారు.న్యూస్ పేపర్లు, టీవీలు, రెడీయో, పత్రికలు, సోషల్, డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్‌‌‌‌కు, ప్రచార మాద్యమాలకు ఈ నిషేధం వర్తిస్తుందని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి  ప్రజాప్రతినిధుల చట్టం, 1951 ప్రకారం రెండేండ్ల జైలు శిక్ష, జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉందన్నారు.