పోలీసులపై ఈసీ చర్యలు తీసుకోవాలి: నిరంజన్

పోలీసులపై ఈసీ చర్యలు తీసుకోవాలి: నిరంజన్
  • ఎఫ్ఐఆర్​లో అమిత్ షా, కిషన్ రెడ్డి పేర్లు ఎందుకు చేర్చరు?

హైదరాబాద్, వెలుగు : ఎంపీ ఎన్నికల ప్రచారంలో కోడ్​ఉల్లంఘించిన కేసులో పోలీసులు కొంతమంది పేర్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఆరోపించారు. వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​చేశారు. సోమవారం గాంధీ భవన్ లో నిరంజన్ మీడియాతో మాట్లాడారు. మే 1న హైదరాబాద్ లోక్​సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న ప్రచారంలో చిన్న పిల్లలు పాల్గొన్నారని.. ఈ అంశంపై తాము మొఘల్ పుర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు.

అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా పోలీసులకు అందజేశామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలు, ర్యాలీల్లో చిన్నారులను ఉపయోగించవద్దని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, మెటీరియల్ ఎవిడెన్స్ లో ఉన్న రాజా సింగ్, మాధవీ లత  పేర్ల మీద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారని, ఆ ఎఫ్ఐఆర్ లో అమిత్ షా, కిషన్ రెడ్డి పేర్లు చేర్చడం లేదని నోటీసులు పంపారని ఆయన తెలిపారు. వారిద్దరి పేర్లు ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చరని ఆయన ప్రశ్నించారు.

చార్జ్​షీట్ లో పేర్లు తొలగించే ప్రయత్నం చేస్తున్న సంబంధిత పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని నిరంజన్ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో అమిత్ షా మెంబర్ గా ఉన్నారని, ఆయనకు ఈసీ రూల్స్ తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. తమ ఫిర్యాదుపై ఈసీ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.