ఖైరతాబాద్‌‌ కు ఉప ఎన్నిక.. సుప్రీం తీర్పుతో సీటు ఖాళీ.. త్వరలోనే షెడ్యూల్..

ఖైరతాబాద్‌‌ కు ఉప ఎన్నిక.. సుప్రీం తీర్పుతో సీటు ఖాళీ.. త్వరలోనే షెడ్యూల్..
  • త్వరలో షెడ్యూల్‌‌ ప్రకటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం  
  • ఉప ఎన్నికల్లో తేల్చుకుంటా: దానం నాగేందర్​ 

హైదరాబాద్‌‌, వెలుగు: దానం నాగేందర్‌‌ అనర్హత పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఖైరతాబాద్‌‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. కోర్టు తీర్పు కాపీ అసెంబ్లీ స్పీకర్‌‌కు అందిన తర్వాత శాసనసభ సెక్రటేరియట్‌‌ ఈ నియోజకవర్గం ఖాళీ అయినట్టు ప్రకటించనుంది. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఖైరతాబాద్‌‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌‌ ప్రకటించనుంది. తెలంగాణలో కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో ఉప ఎన్నిక కానుంది. 

ఇప్పటికే కంటోన్మెంట్‌‌లో లాస్య నందిత(బీఆర్‌‌ఎస్‌‌) మృతితో ఉప ఎన్నిక రాగా.. కాంగ్రెస్‌‌ అభ్యర్థి శ్రీగణేశ్‌‌ విజయం సాధించారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌‌ బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌‌(బీఆర్​ఎస్​) మృతితో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌‌ అభ్యర్థి నవీన్‌‌ యాదవ్‌‌ గెలుపొందారు.  

పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్​పై అనర్హత వేటు పడడంతో ఖైరతాబాద్​కు ఉప ఎన్నిక ఖాయమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ బై ఎలక్షన్​ కారణంగా రాష్ట్ర రాజకీయాలు మరోసారి ఉత్కంఠ రేపే అవకాశాలున్నాయి.