పార్టీల ఉచితాల ప్రకటనలు : సుప్రీం కోర్టులో పిల్

పార్టీల ఉచితాల ప్రకటనలు : సుప్రీం కోర్టులో పిల్

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టి లబ్ధి పొందేందుకు రాజకీయ పార్టీలు చేసే ఉచితాల ప్రకటనలపై, ఆర్థిక వ్యవస్థపై ఉచితాల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్​ దాఖలైంది. హేతుబద్ధత లేకుండా, బడ్జెట్​గురించి ఆలోచించకుండా అడ్డగోలుగా ఉచితాలను ప్రకటించే రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని ఆ పిల్​లో కోరారు. సీనియర్​ అడ్వొకేట్​ విజయ్​ హన్సారియా తన లాయర్​ అశ్వినీ ఉపాధ్యాయ్​తో ఈ పిల్​ వేయించారు. దేశానికి చెందిన 2 అత్యున్నత ఆర్థిక సంస్థలు.. ఈ ఉచితాల వల్ల ప్రజలపై పడే ప్రభావం గురించి ఆందోళన వ్యక్తంచేశాయని అడ్వొకేట్​ విజయ్​ తెలిపారు.

‘‘కేంద్రం ఇచ్చిన అప్పులు భారీగా ఉన్నా.. అవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అదేపనిగా అప్పులు చేస్తున్నాయి. రాష్ట్రాలు అనవసరమైన అప్పులు చేయకుండా కట్టడి చేయాలి. ఉచితాలు ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో అధ్యయనం చేసేందుకు నిపుణులతో కూడిన కమిటీని నియమించాలి” అని ఆ పిల్​లో విజ్ఞప్తి చేశారు. కాగా, ఎన్నికల టైమ్​లో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలపైనా, ఆర్థిక వ్యవస్థపై అవి చూపే ప్రభావంపైనా మేధోమథనం చేయాలని కేంద్రం, నీతి ఆయోగ్, ఫైనాన్స్​కమిషన్, ఆర్బీఐ వంటి సంస్థలకు సుప్రీంకోర్టు ఈ నెల 3న సూచించింది. అటువంటి వాటిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.