రిలయన్స్ టెలికాం మాజీ ఎగ్జిక్యూటివ్‌లను ఈడీ షాక్: గౌతమ్ దోషి, సతీష్ సేథ్ అరెస్ట్

రిలయన్స్ టెలికాం మాజీ ఎగ్జిక్యూటివ్‌లను ఈడీ షాక్: గౌతమ్ దోషి, సతీష్ సేథ్ అరెస్ట్

ఇండస్ట్రియలిస్ట్ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ సంస్థల్లో జరిగిన మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సంచలన నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ టెలికామ్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, అనిల్ అంబానీకి అత్యంత సన్నిహితులైన గౌతమ్ దోషి, సతీష్ సేథ్‌లను ఈడీ అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. న్యూఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలోని స్పెషల్ టీమ్ ఈ మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తోంది.

అరెస్ట్ అనంతరం గౌతమ్ దోషిని ఢిల్లీకి తరలించి, ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు సతీష్ సేథ్ అరెస్ట్ అయిన వెంటనే అనారోగ్య కారణాలతో ముంబైలోని జేజే హాస్పిటల్‌లో చేరారు. వైద్యుల అనుమతి లేకపోవడంతో ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. ముంబై కోర్టు సేథ్‌కు 2 రోజుల ఈడీ కస్టడీని మంజూరు చేస్తూ.. జూన్ 14న ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టాలని ట్రాన్సిట్ రిమాండ్ జారీ చేసింది.

గతంలో అనిల్ అంబానీ కోర్ టీమ్‌లో అమితాబ్ జున్‌జున్‌వాలాతో పాటు ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. జున్‌జున్‌వాలా ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. గౌతమ్ దోషి గతంలో 2011 నాటి 2G స్పెక్ట్రమ్ కేసులో సీబీఐ ద్వారా అరెస్ట్ అయి 7 నెలల పాటు జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది మార్చిలో SBI నేతృత్వంలోని 11 బ్యాంకుల కన్సార్టియం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. రూ.100 కోట్లకు పైగా బ్యాంక్ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై వీరిద్దరిపై సీబీఐ కొత్త అవినీతి కేసు నమోదు చేసింది. ఈ ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లకు ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్‌తో ఎలాంటి సంబంధం లేదని అనిల్ అంబానీ ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రస్తుతం వారు సొంతంగా రియల్ ఎస్టేట్, టాక్స్ అడ్వైజరీ బిజినెస్‌లలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఏదేమైనా ఈడీ జరిపిన ఈ అరెస్టులు ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.