బీజేపీ అనుబంధ సంస్థగా ఈడీ.. రాహుల్‌‌గాంధీపై ఈడీ వేధింపులు సరికాదు

బీజేపీ అనుబంధ సంస్థగా ఈడీ..    రాహుల్‌‌గాంధీపై ఈడీ వేధింపులు సరికాదు
  •     దేశాభివృద్ధికి హైదరాబాద్ దిక్సూచి : మంత్రి పొన్నం

హుస్నాబాద్, వెలుగు : ఈడీ బీజేపీ అనుబంధ సంస్థలా వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. నేషనల్‌‌ హెరాల్డ్‌‌ కేసులో రాహుల్‌‌ గాంధీపై ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేయడం దురదృష్టకరమన్నారు. 

బీజేపీ వైఫల్యాలపై పార్లమెంట్‌‌లో చర్చ జరగకుండా ఉండేందుకే ప్రతిపక్ష నాయకులను కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో చేతులు కలిపిన వారిని చూసీచూడనట్లు వదిలేస్తూ... ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కోర్‌‌ అర్బన్‌‌, సెమీ అర్బన్, రీజియన్, గ్రామీణ ప్రాంతాలుగా విభజించి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు.

 తెలంగాణను దేశానికి దిక్సూచిలా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్‌‌ భౌగోళిక పరిస్థితులు, రోడ్లు, రవాణా, నీటి వనరులు, కాలుష్యరహిత వాతావరణం నగర అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయన్నారు. 

సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌ లింగమూర్తి, ఏఎంసీ చైర్మన్‌‌ తిరుపతిరెడ్డి, బంక చందు, ఐలయ్య, చిత్తారి రవి, పద్మ, సరోజన, సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం 3న హుస్నాబాద్‌‌లో జరగనున్న సీఎం రేవంత్‌‌రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి వెంట కలెక్టర్‌‌ హైమావతి, ఏసీపీ సదానందం, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌‌ ఉన్నారు.