Liquor scam case : 76.54 కోట్ల ఆస్తుల అటాచ్ చేసిన ఈడీ

Liquor scam case : 76.54 కోట్ల ఆస్తుల అటాచ్ చేసిన ఈడీ

లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఈ కేసులో నిందితులకు చెందిన రూ.76.54 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  అరుణ్ పిళ్లైకు సంబంధించి వట్టినాగులపల్లిలో ఉన్న రూ.2.25కోట్ల విలువైన భూములను ఈడీ స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు ఇండో స్పిరిట్ గ్రూప్ ఓనర్ సమీర్ మహేంద్రు, ఆయన భార్య గీతికా మహేంద్రుకు సంబంధించి  ఢిల్లీ జోర్ బాగ్లోని రూ.35 కోట్ల విలువైన రెసిడెన్షియల్ ప్రాపర్టీతో పాటు అమిత్ అరోరాకు చెందిన గురుగ్రాం లోని రూ.7.68 కోట్ల విలువైన ఇంటిని అటాచ్ చేసింది. ఇక రూ. 1.77కోట్ల విలువైన లోయర్ పారేల్ లోని విజయ్ నాయర్ నివాసం, దినేష్ అరోరాకు చెందిన రూ. 3.18 కోట్ల విలువైన మూడు రెస్టారెంట్లు, ఇండో స్పిరిట్ గ్రూపునకు సంబంధించి రూ.10.23కోట్ల విలువైన 50 వాహనాలతో పాటు 14.39 కోట్ల నగదు, ఫిక్స్ డిపాజిట్లను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. 

2021 – 22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో భారీగా అవినీతి జరిగిందని దాని కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.2,873కోట్ల నష్టం కలిగిందని ఈడీ దర్యాప్తులో తేలింది. విచారణలో భాగంగా ఇప్పటి వరకు గుర్తించిన నిందితులకు చెందిన రూ.76.54 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి పీసీ యాక్ట్ సెక్షన్7, ఐపీసీ సెక్షన్ 1290 బీ ప్రకారం వాటిని అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ ఇప్పటి వరకు ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. కుంభకోణంతో సంబంధమున్న ఆరుగురు నిందితులు విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, శరత్ రెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లిని అరెస్ట్ చేసింది. వారంతా ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.