అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్.. యెస్ బ్యాంక్ కేసులో రూ.1,120 కోట్ల ఆస్తులు జప్తు!

అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్.. యెస్ బ్యాంక్ కేసులో రూ.1,120 కోట్ల ఆస్తులు జప్తు!

భారత కార్పొరేట్ రంగంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్‌ పై ఈడీ చర్యలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. దర్యాప్తు సంస్థ ఉక్కుపాదం మోపటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, -రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ యెస్ బ్యాంక్ మోసాల కేసులో భాగంగా ఈడీ తాజాగా రూ.1,120 కోట్ల విలువైన 18కి పైగా ఆస్తులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ అకౌంట్లలో బ్యాలెన్స్, అన్‌కోటెడ్ ఇన్వెస్ట్‌మెంట్‌లను అటాచ్ చేసింది.

దీంతో దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన ఆస్తుల మొత్తం అటాచ్‌మెంట్ విలువ ఏకంగా రూ. 10వేల117 కోట్లకు చేరింది. గతంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్సహా ఇతర బ్యాంక్ మోసాల కేసుల్లో ఇప్పటికే రూ.8వేల 997 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ జప్తు చేసిన ఘటన మరువక ముందే మరోసారి ఆస్తుల అటాచ్మెంట్ నిర్వహించటం దూకుడును సూచిస్తోంది. 

జప్తు చేసిన ఆస్తుల వివరాలు:

అటాచ్ చేసిన ఆస్తుల వాటిలో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి చెందిన 7 ఆస్తులు, రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు చెందిన 2 ఆస్తులు, రిలయన్స్ వాల్యూ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 9 ఆస్తులు ఉన్నాయని ఈడీ ప్రకటనలో పేర్కొంది . వీటితో పాటు పలు గ్రూప్ కంపెనీల పేరుతో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బయటకు వెల్లడించని ఇన్వెస్ట్‌మెంట్‌లు కూడా వీటిలో ఉన్నాయి. 

ఈడీ దర్యాప్తులో రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు రుణంగా పొందిన ప్రజాధనాన్ని అక్రమంగా మళ్లించినట్లు గుర్తించింది. 2017–2019 మధ్యకాలంలో యెస్ బ్యాంక్, RHFLలో రూ.2వేల965 కోట్లు, RCFLలో రూ.2వేల 045 కోట్లు పెట్టుబడి పెట్టింది. 2019 డిసెంబర్ నాటికి ఈ పెట్టుబడులు నిరర్థక ఆస్తులుగా మారాయని లెక్కల్లో చూపించబడింది. అయితే నిధుల దుర్వినియోగం కారణంగా ఈ రెండు కంపెనీల్లో దాదాపు రూ.11వేల కోట్ల ప్రజాధనం  పక్కదారి పట్టినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. 

యెస్ బ్యాంక్ నిధులను పెట్టుబడిగా పెట్టడానికి ముందు, రిలయన్స్ నిప్పన్ మ్యూచువల్ ఫండ్ నుంచి యెస్ బ్యాంక్‌కు భారీ మొత్తంలో నిధులు అందాయి. అయితే సెబీ రూల్స్ ప్రకారం కాన్ ఫ్లిక్ట్ ఆఫ్ ఇన్ట్రెస్ట్ అంటే ద్వంద ప్రయోజనాల దృష్ట్యా రిలయన్స్ నిప్పన్ మ్యూచువల్ ఫండ్ నేరుగా అనిల్ అంబానీ గ్రూప్ ఫైనాన్స్ కంపెనీలలో పెట్టుబడి పెట్టకూడదు. అయితే డబ్బును ఒక సర్క్యూటస్ మార్గంలో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ మళ్లినట్లు ఈడీ వెల్లడించింది. దీనికి తోడు సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ పై కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది. 2010–12 నుండి దేశీయ, విదేశీ రుణదాతల నుంచి RCOM తీసుకున్న రుణాల్లో రూ.40వేల185 కోట్లు ఇంకా బకాయి ఉందని తేలింది. RCOM రూ.13వేల 600 కోట్లకు పైగా రుణాల ఎవర్‌గ్రీనింగ్ కోసం మళ్లించింది. అలాగే రూ.12వేల 600 కోట్లు సంబంధిత పక్షాలకు మళ్లించగా.. రూ.1,800 కోట్లు ఎఫ్‌డిలు/మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టి తిరిగి అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలకు మళ్లించారు.