నాగారం భూదాన్ భూముల కేసులో ఆస్తులు జప్తు..ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూముల రిజిస్ట్రేషన్లు

నాగారం భూదాన్ భూముల కేసులో ఆస్తులు జప్తు..ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూముల రిజిస్ట్రేషన్లు
  • ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూముల రిజిస్ట్రేషన్లు
  • అధికారులతో కలిసి రెవెన్యూ రికార్డులు మార్చిన ఖాదర్ ఉన్నిసా
  • మనీలాండరింగ్‌‌‌‌ కేసులో ఈడీ దర్యాప్తు, 4.8 కోట్ల విలువ చేసే ఆస్తులు అటాచ్‌‌‌‌ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 181లోని భూదాన్ భూములను ఫోర్జరీ డాక్యుమెంట్లతో విక్రయించిన మహ్మద్‌‌‌‌ మునావర్‌‌‌‌‌‌‌‌ ఖాన్ అతని భార్య ఫైకా తహాఖాన్‌‌‌‌కు చెందిన ఆస్తులను అటాచ్‌‌‌‌ చేసింది. శంషాబాద్‌‌‌‌, బంజారాహిల్స్, టోలీచౌకిలోని రూ.4.8కోట్లు విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది.  ఈమేరకు హైదరాబాద్‌‌‌‌ జోనల్ ఈడీ కార్యాలయం సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.

నాగారం సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 181 భూముల గోల్‌‌‌‌మాల్ ఇలా

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, నాగరం గ్రామంలోని సర్వే నంబర్ 181లో ఉన్న ప్రభుత్వ భూమి, భూదాన్ భూములకు సబంధించి ఖాద‌‌‌‌ర్ ఉనిస్సా ఆమె కుమారుడు మహ్మద్‌‌‌‌ మునావర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను తమ పూర్వీకుల ఆస్తిగా పేర్కొంటూ రెవెన్యూ రికార్డుల తయారు చేశారు. కొంతమంది ప్రభుత్వ అధికారులతో కలిసి ఫోర్జరీ, భూమి రెవెన్యూ రికార్డులను మార్చారు. ఫలితంగా ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఆ తరువాత మధ్యవర్తుల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారు. ప్రభుత్వ భూమి/భూదాన్ భూమిని చట్టవిరుద్ధంగా విక్రయించడం ద్వారా ఖాదర్ ఉనిస్సా, మునావర్ ఖాన్‌‌‌‌కు రూ.6.45 కోట్లు ఆర్జించారు. ఇలా వచ్చిన డబ్బుతో మునావర్ ఖాన్, తన భార్య ఫైకా తహాఖాన్ పేరున స్థిరాస్తులను కొనుగోలు చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించడం, ఫోర్జరీ, ప్రభుత్వ రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం వంటి ఆరోపణలకు 2023లో మహేశ్వరం పోలీస్ స్టేషన్‌‌‌‌లో నమోదైన కేసు ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్‌‌‌‌ కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న  ఖాద‌‌‌‌ర్ ఉనిస్సా, మహ్మద్‌‌‌‌ మునావర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌ సహా పలువురు ప్రైవేట్‌‌‌‌, ప్రభుత్వ అధికారుల ఆస్తులపై విచారణ జరిపింది. రూ.4.8 కోట్లు విలువ చూసే ఆస్తులను అటాచ్‌‌‌‌మెంట్‌‌‌‌ చేసింది.