హెచ్‌‌సీఏ నిధుల గోల్‌‌మాల్‌‌పై ఈడీ దర్యాప్తు షురూ

హెచ్‌‌సీఏ నిధుల గోల్‌‌మాల్‌‌పై ఈడీ దర్యాప్తు షురూ
  • సీఐడీ నుంచి సేకరించిన ఎఫ్‌‌ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్‌‌ నమోదు‌‌
  • బీసీసీఐ నిధులపై ఇన్వెస్టిగేషన్
  • మనీలాండరింగ్ కోణంలో విచారణ.. హెచ్‌‌సీఏ ఆర్థిక లావాదేవీపై ఆరా

హైదరాబాద్‌, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్​సీఏ) నిధుల గోల్‌మాల్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. సీఐడీ ఎఫ్ఐఆర్, నిందితుల రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్ మోహన్ రావు అక్రమాల గురించి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ కేసులో జగన్ మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంటె సహా శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ జనరల్‌ సెక్రటరీ రాజేందర్‌యాదవ్‌ ఆయన భార్య శ్రీచక్ర క్రికెట్‌క్లబ్‌ అధ్యక్షురాలు కవితను ఈ నెల 9న సీఐడీ అరెస్ట్‌ చేసింది. బీసీసీఐ నిధుల దారిమళ్లింపు సహా ఐపీఎల్‌ టికెట్లలో గోల్‌మాల్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఈ కేసులో నిధుల దుర్వినియోగంపై ఈడీ ఫోకస్ పెట్టింది. సీఐడీ ఎఫ్‌ఐఆర్ సహా సీజ్ చేసిన రికార్డులను తమకు అందించాలని ఈ నెల 11న లెటర్ రాసింది. సీఐడీ నుంచి బుధవారం హెచ్‌సీఏ కేసు రికార్డులు ఈడీ కార్యాలయానికి చేరాయి.

బీసీసీఐ నిధుల దారిమళ్లింపుపై ఈడీ నజర్‌‌!

రికార్డులను పరిశీలించిన అనంతరం ఈడీ అధికారులు ఈసీఐఆర్‌‌ రిజిస్టర్ చేశారు. హెచ్ సీఏ నిధులు, నిందితుల ఆర్థిక లావాదేవీల ఆధారంగా దర్యాప్తు చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా హెచ్ సీఏ అధ్యక్షుడు ఈ కేసులో ప్రధాన నిందితుడు జగన్ మోహన్ రావు సహా ఐదుగురు నిందితులను కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హెచ్‌సీఏలో సోదాలు నిర్వహించనున్నారు.

 ఆఫీస్ బేరర్లు సహా హెచ్‌సీఏ బ్యాంక్‌ అకౌంట్లు, ఐపీఎల్‌ మ్యాచ్‌ల ద్వారా వచ్చిన ఆదాయం, ప్రకటనలకు సంబంధించిన వివరాలు సహా జగన్‌మోహన్‌ రావు బృందం హయాంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీయనున్నారు. కాగా, నిందితులందరూ ఈ నెల 22 వరకు సీఐడీ కస్టడీలో ఉన్నందున కస్టడీ ముగిసిన అనంతరం ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నది. బీసీసీఐ నుంచి ప్రతి ఏటా దాదాపు రూ.100 కోట్లకు వరకు నిధులు వస్తాయి. వీటిలో భారీగా నిధులు దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ రికార్డ్‌ చేసిన స్టేట్‌మెంట్లను కూడా ఈడీ పరిగణనలోకి తీసుకోనున్నది.