- వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దంటూ అప్రూవర్‌ను బెదిరించారు
- ఫోన్లలో డేటాను ఆమె డిలీట్ చేశారు.. కోర్టు దృష్టికి తెచ్చిన ఈడీ
- కవిత కొడుక్కు ఎగ్జామ్స్ ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న ఆమె తరఫు అడ్వకేట్
- ఆ అబ్బాయి ఒంటరి కాదని, ఇప్పటికే కొన్ని ఎగ్జామ్స్ ముగిశాయన్న ఈడీ
- ఈ నెల 8న తీర్పు వెలువరించనున్న కోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే సూత్రధారి అని, అందుకే ఆమె బెయిల్ అప్లికేషన్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న వ్యక్తికి బెయిల్ ఇవ్వొద్దని, ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని కోర్టు దృష్టికి తెచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కవిత తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ రౌన్స్ అవెన్యూలోని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై గురువారం జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. కవిత తరఫున అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరఫున అడ్వకేట్జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్ పై ఈడీ దాఖలు చేసిన కౌంటర్ కు రిజాయిండర్ ఫైల్ చేసినట్లు కోర్టుకు సింఘ్వీ తెలిపారు. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం మహిళగా, అలాగే కొడుకు ఎగ్జామ్స్ నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన కోరారు.
కవిత అరెస్ట్ తో కుమారుడు మానసికంగా కుంగిపోయాడని, ఈ ప్రభావంతో పరీక్షలకు గైర్హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. పిల్లల పరీక్షల సందర్భంలో తల్లి మద్దతు అవసరమని చెప్పారు. తండ్రి, తల్లి పాత్రను భర్తీ చేయలేరని.. ఇదే అంశంపై ప్రధాని ‘మోదీ పరీక్ష పే చర్చ’ నిర్వహిస్తున్నారని కోర్టుకు ఆయన వివరించారు. ఇలాంటి సందర్భంలో గతంలో పలు కేసుల్లో మహిళలకు న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయని చెప్పారు. కవితకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. ‘‘తల్లితో ఉన్న ఆత్మీయత, అనుంబంధాన్ని ఎవరూ తీర్చలేరు. మన కుటుంబాలకు ఓ విధానం ఉంది. దీంట్లో తల్లి పాత్ర చాలా కీలకం. కొడుకు హైదరాబాద్‌లో ఉన్నాడు. తల్లి జైల్లో ఉంది. తండ్రి కోర్టు కేసుల కోసం ఢిల్లీలో ఉన్నారు’’ అని కోర్టుకు దృష్టికి సింఘ్వీ తీసుకెళ్లారు.
ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు: ఈడీ
లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నదని ఈడీ తరఫు అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ కోర్టుకు వివరించారు. దర్యాప్తు కీలక దశలో ఉన్న టైంలో కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల పూర్తి దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని అన్నారు. అలాగే ఆమె బెయిల్ పై బయటకు వస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని చెప్పారు. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని కోర్టుకు నివేదించారు. ‘‘లిక్కర్ స్కామ్‌కు ప్లాన్ చేసింది కవిత. ఆమె మొబైల్ ఫోన్లను మార్చారు.. ఆధారాలు ధ్వంసం చేశారు. ఈడీకి ఇచ్చిన ఫోన్లలో ఆమె సమాచారాన్ని డిలీట్ చేసినట్లు వుంది. ఇట్ల ఆధారాలను ధ్వంసం చేసిన వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదు”అని చెప్పారు. కవిత సమర్పించిన మొత్తం 10 ఫోన్లను ఫోరెన్సిక్ లాబ్‌కు పంపామని, ఫోరెన్సిక్ లాబ్ డేటా ప్రకారం 4 ఫోన్లు ఫార్మాట్ అయినట్లు తేలిందని వివరించారు. ఈ కేసులో వందల కొద్దీ డిజిటల్ పరికరాల్లో డేటా డిలీట్ అయిందని అన్నారు. మధ్యలో ఈడీ జాయింట్ డైరెక్టర్ భాను ప్రియామీనా.. కవితకు వ్యతిరేకంగా సేకరించిన పలు ఆధారాలను నేరుగా జడ్జి కావేరి బవేజాకు చూపించారు. ‘‘కవిత తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దంటూ అప్రూవర్‌ను బెదిరించారు. ఆమెకు లిక్కర్ వ్యాపారంలో 33 శాతం వాటా ఉంది” అని ఈడీ అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ కోర్టు దృష్టికి తెచ్చారు.
‘‘పరీక్షలు రాస్తున్న కవిత చిన్న కొడుకుతో కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు ఉన్నారు. ఆ అబ్బాయి ఒంటరి కాదు. భారతీయ కుటుంబాల్లో ఇతర కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు కుడా పిల్లలకు మద్దతుగా నిలుస్తారు. ఇప్పటికే ఆ అబ్బాయికి కొన్ని పరీక్షలు ముగిశాయి” అని వివరించారు. కవిత పెద్ద కొడుకు స్పెయిన్ లో ఉంటాడని, అరెస్టు అయిన తల్లిని చూసి వెళ్లిపోయాడని అన్నారు. కవిత తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, ఐటీఆర్ వివరాలు, కుటుంబ వ్యాపార వివరాలు ఇవ్వడం లేదని చెప్పారు. మహిళ కాబట్టి మధ్యంతర బెయిల్ ఇవ్వాలనడం సరికాదన్నారు. ఇరువైపు వాదనలు ముగించిన జడ్జి కావేరి బవేజా తీర్పును రిజర్వ్ చేశారు. ఏప్రిల్ 8 ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 20న విచారణ చేపడతామని చెప్పారు.