హైదరాబాద్, వెలుగు: దుండిగల్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్‌ఐఎస్‌ఏ) నిధుల దుర్వినియోగం కేసులో ఈడీ బుధవారం చార్జిషీటు దాఖలు చేసింది. ఎన్‌ఐఎస్‌ఏలో మినిస్టీరియల్ సిబ్బందిగా విధులు నిర్వహించిన సీఐఎస్‌ఎఫ్ మాజీ ఏఎస్సై రూప్ సింగ్ మీనాపై అభియోగాలు మోపింది. ఈ మేరకు ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను రంగారెడ్డి జిల్లా స్పెషల్ కోర్టు విచారణకు స్వీకరించింది. వివరాలను హైదరాబాద్ జోనల్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.
రూప్ సింగ్ మీనా ఎన్ఐఎస్ఏలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అకాడమీలోని సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి చెందిన నేషనల్ పెన్షన్ స్కీమ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. 2016 నవంబర్ నుంచి 2020 నవంబర్ వరకు 5,640 మంది సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగులకు చెందిన రూ.60.26 లక్షల పెన్షన్ స్కీమ్ నిధులను దారిమళ్లించాడు. ఇతర సిబ్బందితో పాటు రాజీనామా చేసిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఖాతాలకు వాటిని మళ్లించాడు. ఇందుకు సంబంధించి 2023 ఏప్రిల్ 18న జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
