
- సీఏ గోరంట్ల బుచ్చిబాబు ఇంట్లో ఈడీ సోదాలు
- పలు ప్రాంతాల్లో 23 గంటల పాటు కొనసాగిన తనిఖీలు
- కంపెనీల డాక్యుమెంట్లు, బ్యాంక్ లింకులు గుర్తింపు
- డిజిటల్, ఫోరెన్సిక్ ఆడిటింగ్‌తో లెక్కలు తేల్చనున్న ఈడీ
- అనుమానిత కంపెనీలు, లావాదేవీలపై నోటీసులు ఇచ్చే చాన్స్
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీ ల్యాండరింగ్ లెక్కలు తేల్చడంపై దృష్టిపెట్టింది. ఈ కేసుతో లింక్ ఉన్న హైదరాబాద్ లిక్కర్ కంపెనీలు, ఆఫీసుల్లో శుక్రవారం నుంచి 23 గంటల పాటు ఈడీ సోదాలు జరిపింది. దోమలగూడలోని చార్డర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు ఆఫీస్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైన సోదాలు శనివారం ఉదయం 5.30 గంటలకు ముగిశాయి. ఈ సోదాల్లో హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, పలు కంపెనీలకు చెందిన కీలక డాక్యుమెంట్లు, ఇన్‌కమ్ ట్యాక్స్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సీజర్ రిపోర్ట్‌పై సంబంధింత సిబ్బంది సంతకాలు తీసుకున్నారు. దీంతో పాటు పంచుల ఆధ్వర్యంలో స్టేట్‌మెంట్లు రికార్డ్ చేశారు.
లిక్కర్ స్కాం కేసులో రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్టిబ్యూటర్స్ కంపెనీలు కీలకంగా మారాయి. వీటి అడ్రస్‌లో అనూస్ బ్యూటీ పార్లర్స్, ఇతర సంస్థలు కొనసాగుతుండటంపై ఈడీ ఆధారాలు సేకరించింది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లపై డిజిటల్, ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తోంది. వీటి ఆధారంగా ఇన్‌కమ్ ట్యాక్స్, మనీ ట్రాన్సాక్షన్స్‌లో జరిగిన అవకతవకలను గుర్తించనుంది. ఆ తర్వాత అనుమానిత అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ అయిన డబ్బుకు లెక్కలు చెప్పాలని సంబంధిత వ్యక్తులను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్, కర్నాటక, ఏపీలో రిజిస్టరైన కంపెనీల నుంచి ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా ఈడీ గుర్తించినట్లు సమాచారం.
గోరంట్ల అండ్ అసోసియేట్స్ సంస్థకు చెందిన సీఏలు, ఆడిటర్లు నిర్వహించిన ఆర్థిక వ్యవహరాలను ఈడీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రైవేట్ కంపెనీల ఏర్పాటుకు ఫర్మ్ రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి పెట్టుబడి, ఆదాయ, వ్యయాల వివరాలను రాబడుతోంది. అనుమానిత ట్రాన్సాక్షన్ల వివరాలను సేకరిస్తున్నది. ప్రధానంగా లిక్కర్ కంపెనీలు వాటి అనుబంధ సంస్థల ద్వారా విదేశాల్లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను ఈడీ కలెక్ట్ చేస్తున్నది. దీంతో రాష్ట్రంలోని పలు కంపెనీలకు చెందిన డైరెక్టర్లు, పార్ట్‌నర్స్‌ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని, వీరికి నోటీసులు ఇచ్చేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారని తెలిసింది.