నేషనల్ హెరాల్డ్ కేసు : రూ.751.9 కోట్ల ఆస్తులు జప్తు

నేషనల్ హెరాల్డ్ కేసు : రూ.751.9 కోట్ల ఆస్తులు జప్తు

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీని విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక విషయాన్ని చెప్పింది. 

నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబానికి రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశామని తాజాగా ఈడీ చెప్పింది. ఈ ఆస్తులు యంగ్ ఇండియన్ షేర్‌హోల్డర్లు అయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి చెందినవిగా పరిగణించాలని, అందువల్ల వారు పన్నులకు బాధ్యులని ఆదాయపు పన్ను శాఖ చెప్పిందని గుర్తు చేసింది ఈడీ.  

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఈడీ మంగళవారం (నవంబర్ 21న) తెలిపింది. ఢిల్లీ, ముంబై, లక్నో వంటి నగరాల్లో స్థిరాస్తుల రూపంలో ఉన్న రూ.661.69 కోట్లు, AJL ఈక్విటీ షేర్లలో పెట్టుబడి రూపంలో ఉన్న రూ.90.21 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. 

నేషనల్ హెరాల్డ్ ఏమిటి.. ?

నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను 1938లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. రాహుల్ గాంధీ ముత్తాత అయిన నెహ్రూ 1947లో భారతదేశపు తొలి ప్రధానమంత్రి అయ్యారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) అనే సంస్థ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించేది. 1937లో స్థాపితమైన ఆ సంస్థలో మరో 5 వేల మంది స్వాతంత్ర్యోద్యమకారులు భాగస్వాములుగా (షేర్‌హోల్డర్లు) ఉండేవారు. ఆ కంపెనీ మరో రెండు -ఉర్దూలో క్వామీ ఆవాజ్, హిందీలో నవజీవన్ - దినపత్రికలను కూడా ప్రచిరించేది. అతికొద్దికాంలోనే ప్రజల నుంచి విశేష ఆదరణ పొందాయి. 

నెహ్రూ తరచుగా బలమైన పదజాలంతో వ్యాసాలు రాసే ఆ పత్రిక సంపాదక శైలిని నాటి బ్రిటిష్ ప్రభుత్వం హేళన చేసేది. అయితే 1942లో ఆ పత్రికను బ్రిటిష్ సర్కారు నిషేధించటంతో అది మూత పడింది. మళ్లీ మూడేళ్ల తర్వాత పత్రిక ప్రచురణ తిరిగి ప్రారంభమైంది. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినపుడు ప్రధానమంత్రి పదవి చేపట్టిన నెహ్రూ.. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 

అనతికాలంలోనే నేషనల్ హెరాల్డ్ పేపర్ ఒక జాతీయవాద పత్రికగా పేరు పొందింది. అయితే ఆర్థిక కారణాలతో 2008లో ఈ న్యూస్ పేపర్ సేవలు నిలిచిపోయాయి. పేపర్ ప్రచురణను కూడా నిలిపివేశారు. కానీ 2016 నుంచి డిజిటల్ పబ్లికేషన్ ప్రారంభమైంది.

అయితే...  నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత సొమ్మును అప్పుగా ఇచ్చింది. ఏజేఎల్ సంస్థకి పార్టీ ఎప్పటికప్పుడు వడ్డీ లేని రుణం ఇచ్చింది. అలా రూ. 90 కోట్లు అందించినా 2008లో ఈ పత్రిక మూతపడక తప్పలేదు. ఆ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బోర్డు డైరెక్టర్లుగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ 2010లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను టేకోవర్ చేసుకుంది. ఇందులో మెజారిటీ షేర్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీవి. మిగిలిన షేర్ కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌వి ఉన్నాయి.

అయితే.. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ మేరకు 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేసు పెట్టారు. సోనియా, రాహుల్ గాంధీలు వేల కోట్ల రూపాయల మేర మోసం చేశారని, భూకబ్జాలకు పాల్పడ్డారని పేర్కొంటూ స్వామి 2012 నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని కోర్టులో ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ద్వారా ఢిల్లీ, యూపీ, ఇతర ప్రాంతాల్లో 16 వందల కోట్ల రూపాయల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ఆస్తులను మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నారని తన ఫిర్యాదులో ఆరోపించారు. కేసు విచారణలో భాగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పలు మార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు.