
ఉత్తరాఖండ్‌లో అంతుచిక్కని జ్వరం కారణంగా అల్మోరా, హరిద్వార్ జిల్లాల్లో కేవలం 15 రోజుల్లో 10 మంది మరణించడంతో స్థానికుల్లో భయాందోళనలు పుట్టిస్తుంది. చనిపోయిన వారికి ఎక్కువగా జ్వరం, ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం కనిపించింది. ఈ లక్షణాలు సాధారణంగా డెంగ్యూ వంటి వైరల్ ఫీవర్ వచ్చినపుడు కనిపిస్తాయి. దీంతో డెంగ్యూ వ్యాప్తి అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. అల్మోరాలో ఏడుగురు, హరిద్వార్‌లో ముగ్గురు చనిపోయారు.
అల్మోరాలో సంభవించిన ఏడు మరణాలలో మూడు మాత్రమే వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల జరిగి ఉండవచ్చని, మిగిలినవి వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఉండవచ్చని డాక్టర్ వివరించారు. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి ఆర్ రాజేష్ కుమార్, ఇదో పెద్ద అంతుచిక్కని జ్వరం లేదా డెంగ్యూ వ్యాప్తి కాదని, ప్రస్తుతానికి సీజనల్ వైరల్ ఫీవర్ అని భావిస్తున్నామని పేర్కొన్నారు. చలికాలం పెరిగే కొద్దీ ఈ కేసుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ మరణాలతో చనిపోయినవారికి పోస్ట్‌మార్టం నిర్వహించకపోవడంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తారు. శవపరీక్ష లేకుండా మరణానికి అసలు కారణం ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ మరణాలకు కచ్చితమైన కారణం తెలుసుకోవడానికి ఆరోగ్య అధికారులు వెంటనే రంగంలోకి దిగి బాధితుల నుండి సాంపుల్స్ తీసుకొని అల్మోరా మెడికల్ కాలేజీకి పంపించారు. ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ చంద్ర తివారీ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో వైద్య బృందాలను మోహరించి, పర్యవేక్షణ ముమ్మరం చేశారు.