
- స్టేట్మెంట్ రికార్డు కోసం ఈడీ నోటీసులు
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. గొర్రెల పంపిణీ స్కీమ్ పేరుతో జరిగిన మనీలాండరింగ్ వివరాలు సేకరిస్తున్నది. ఇందులో భాగంగా 18 మంది గొర్రెల విక్రేతలకు (బాధితులకు) గురువారం నోటీసులు ఇచ్చింది. ఈ నెల 15న ఉదయం10.30 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసులో హాజరుకావాలని సూచించింది. వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. బీఆర్‌ఎస్ పాలనలో గొర్రెల పంపిణీ స్కీమ్ ద్వారా రూ.700 కోట్ల ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టినట్టు ఇప్పటికే ఏసీబీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఏసీబీ నమోదు
చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. సైబర్ నేరాల తరహాలోని 200 మ్యూల్ అకౌంట్లు రూ.1,000 కోట్లు ట్రాన్సాక్షన్ల వివరాలను సేకరించింది.
గొర్రెల స్కీమ్ సొమ్ము గోల్‌మాల్ ఇట్ల..!
గొర్రె పిల్లల కొనుగోలుకు కొండాపూర్‌లోని లొలొనా ది లైవ్ కంపెనీకి అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన సయ్యద్ మొయిద్‌తో పాటు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి కలిసి ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో గొర్రె పిల్లలను కొనుగోలు చేశారు. 2017 నుంచి గొర్రెలను సప్లయ్ చేస్తున్న 18 మంది రైతుల వద్ద 133 యూనిట్ల గొర్రెలను కొనుగోలు చేశారు. వీటికి సంబంధించిన రూ. 2.1 కోట్లు వారి అకౌంట్స్‌లో డిపాజిట్ చేస్తామని చెప్పారు.
నలుగురు అధికారులు కలిసి తమకు తెలిసిన వారి పేర్లతో బినామీ అకౌంట్లు ఓపెన్ చేశారు. బినామీ అకౌంట్ హోల్డర్స్‌నే గొర్రె పిల్లలను విక్రయించిన రైతులుగా రికార్డుల్లో చూపారు. గొర్రె పిల్లలను విక్రయించిన రైతులకు చేరాల్సిన డబ్బును బినామీ అకౌంట్లలో డిపాజిట్ చేసి వాటాలు పంచుకున్నారు. ఎలక్షన్ కోడ్ కారణంగా పంపిణీ చేయడంలో ఆలస్యమైందని రైతులను నమ్మించారు. ఎలక్షన్స్ కోడ్ ముగిసిన తర్వాత కూడా రైతులకు డబ్బు చేరలేదు. దీంతో బాధిత రైతులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.