ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. నవంబర్‌ 2వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. లిక్కర్‌ పాలసీ వ్యవహారంలో ఏప్రిల్‌లో సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. 

తాజాగా ఈడీ సైతం విచారణకు రావాలని కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. ఎక్సైజ్‌ పాలసీ వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు ఆధారంగా ఈడీ సైతం విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

ఇదే కేసులో ప్రస్తుతం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా జైలులో ఉన్నారు. ఆయన బెయిల్‌ పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం (అక్టోబర్ 30న) తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో కేసు విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. విచారణ ఆలస్యమైతే సిసోడియా మళ్లీ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు చెప్పింది.