
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులిచ్చింది. గతంలో రెండు రోజుల పాటు రోహిత్ రెడ్డిని విచారించిన ఈడీ..ఈ నెల 27న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఆ రోజు రోహిత్ రెడ్డి డుమ్మా కొట్టారు. అయితే 27న అటెండ్ అవ్వకపోతే 30వ తేదీన రావాలని ఈడీ నోటీసులిచ్చింది.
30న విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులివ్వడంపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత, కుటుంబ, ప్రైవేటు సమాచారాన్ని రాబట్టడానికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను విచారిస్తోందని.. విచారణను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈడీ జారీ చేసిన నోటీసులపై జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. అటు ఈడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని రోహిత్ రెడ్డి వేసిన పిటిషన్ పై వచ్చే నెల 5న కౌంటర్ వేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది.