రూ.20లక్షలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన.. ఈడీ ఆఫీసర్

రూ.20లక్షలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన.. ఈడీ ఆఫీసర్

తమిళనాడులో లంచం తీసుకుంటూ ఈడీ అధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టేసేందుకు లంచం తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. తమిళనాడు దిండిగల్ ప్రాంతంలో ఓ డాక్టర్ నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ అంకిత్ తివారీ అనే ఈడీ అధికారి పోలీసులకు చిక్కాడు. వాస్తవానికి మనీలాండరింగ్‌ కేసుల్లో కొందరు డీఎంకే మంత్రులు ఇప్పటికే అరెస్టయ్యారు. మరికొందరు ఈడీ నిఘాలో ఉన్నారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఓ ఈడీ అధికారి పట్టుబడటం సంచలనంగా మారింది. పట్టుబడిన అంకిత్‌ గతంలో ఇంకెవరి దగ్గరైనా ఇలాగే లంచం తీసుకున్నారా అనే కోణంలో తమిళనాడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంకిత్‌ అరెస్ట్‌ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే అంకిత్‌ను ఈ కేసులో ఇరికించారనే ప్రచారం కూడా జరుగుతోంది.

అక్టోబర్ 29న, అంకిత్ తివారీ ఆ జిల్లాలో తనపై నమోదైన విజిలెన్స్ కేసు గురించి డిండిగల్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని సంప్రదించాడు. ఈ కేసుపై విచారణ జరపాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని ఉద్యోగికి తెలిపారు. అక్టోబరు 30న మధురైలోని ఈడీ కార్యాలయం ముందు హాజరు కావాలని ప్రభుత్వ ఉద్యోగిని తివారీ కోరాడు. ఆ వ్యక్తి మధురై వెళ్లినప్పుడు, ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.3 కోట్లు చెల్లించాలని తివారీ అడిగాడు. అనంతరం ఉద్యోగితో మాట్లాడుతూ సీనియర్ అధికారులతో మాట్లాడి లంచాన్ని రూ.51 లక్షలకు తగ్గించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.

నవంబర్ 1న ప్రభుత్వ ఉద్యోగి తివారీకి మొదటి విడతగా రూ.20 లక్షలు లంచంగా ఇచ్చాడని సమాచారం. ఆ తర్వాత పూర్తి మొత్తం రూ.51 లక్షలు చెల్లించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాట్సాప్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా తివారీ పలు సందర్భాల్లో ఉద్యోగిని బెదిరించాడు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగి నవంబర్ 30న డివిఎసి డిండిగల్ యూనిట్‌లో అతనిపై ఫిర్యాదు చేశాడు. ఈడీ అధికారిగా అంకిత్ తన అధికారాలను దుర్వినియోగం చేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతనిపై డివిఎసి కేసు నమోదు చేసింది. డిసెంబర్ 1న ప్రభుత్వ ఉద్యోగి నుంచి రెండో విడతగా రూ. 20 లక్షలు తీసుకుంటుండగా అంకిత్ తివారీని డీవీఏసీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.