
ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో గ్రానైట్ వ్యాపారులు ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. సీనరేజి ఎగ్గొట్టేందుకు ఎగుమతి చేసిన గ్రానైట్‌ను తగ్గువగా నమోదు చేశారని.. 2013లో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అప్పటి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. సుమారు రూ.124 కోట్ల పన్ను ఎగ్గొట్టారని గ్రానైట్ కంపెనీలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. గత కొద్దిరోజుల క్రితం దాదాపుగా 8 గ్రానైట్ కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల ఆధారంగా వ్యాపారులను విచారణకు పిలిచారు. దీనిలో భాగంగా పలు కంపెనీల కాంట్రాక్టర్లు ఈడీ ముందుకు హాజరయ్యారు.
గ్రానైట్ ఎగుమతుల్లో జరిగిన అక్రమాలను అధికారులు గుర్తించారు. అలాగే అనధికారిక ఎగుమతులకు సంబంధించిన చెల్లింపుల కోసం ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తుల పేర్లతో బినామీ ఖాతాలు తెరిచారని, విదేశాల నుంచి ఆయా ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయినట్లు ఈడీ సోదాల్లో బయటపడింది. గత పదేళ్లుగా జరుగుతున్న ఇలాంటి అక్రమాలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఈడీ అధికారులు తెలిపారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నారు. తదుపరి దర్యాప్తులో భాగంగా బాధ్యులను విచారించి, వారి వాంగ్మూలం నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇక గ్రానైట్ దిగుమతి చేసుకున్న విదేశీ సంస్థల వివరాలపైనా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.