జాక్వెలిన్ ఫెర్నాండెజ్​కు మళ్లీ ఈడీ నోటీసులు

జాక్వెలిన్ ఫెర్నాండెజ్​కు మళ్లీ ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ కు సంబంధించిన కేసులో ఈ నోటీసులు పంపించింది. బుధవారం ఈడీ విచారణకు ఆమె డుమ్మా కొట్టడంతో తమ ముందు హాజరు కావాలని మరోసారి పేర్కొంది. ఫోర్టిస్ హెల్త్ కేర్ ప్రమోటర్ శివిందర్ సింగ్, అతడి భార్య అదితి సింగ్ ను రూ.200 కోట్ల మేర మోసం చేశాడని సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

ఈ అక్రమ డబ్బును ఉపయోగించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు బహుమతులు కొనుగోలు చేశాడని ఈడీ ఆరోపించింది. సుకేశ్ చంద్రశేఖర్ మోసాల గురించి ఆమెకు తెలుసని.. అయినప్పటికి వాటిని పట్టించుకోకుండా అతడితో సంబంధాలను కొనసాగించిందని ఈడీ వెల్లడించింది. ఇదే కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్​ను ఈడీ గతంలోను ప్రశ్నించింది. సుకేశ్ చంద్రశేఖర్​తో గల సంబంధాలపై ఆరా  తీసింది.