
- 6 గంటల విచారణ
- నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాను ప్రశ్నించిన ఈడీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని ఈడీ మంగళవారం దాదాపు 6 గంటలపాటు ప్రశ్నించింది. ఉదయం 11 గంటలకు రాహుల్, ప్రియాంకతోపాటు సోనియా గాంధీ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. బుధవారం కూడా ఈడీ ఆమెను విచారించనుంది. సోనియాను ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు విజయ్‌చౌక్ వద్ద నిరసనలకు దిగారు. పార్లమెంట్‌లో ముఖ్యమైన అంశాలు చర్చించడం లేదని, బయటా ప్రజల గొంతుకను వినిపించనివ్వడం లేదని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించిన రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి విచారించింది. దాదాపు 6 గంటలపాటు ప్రశ్నించి.. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు తన కొడుకు, ఎంపీ రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీతోపాటు ఈడీ ఆఫీసుకు సోనియా వచ్చారు. సోనియా ఆరోగ్యం దృష్ట్యా ప్రియాంక అక్కడే ఇంకో రూమ్‌లో ఉండిపోయారు. 11.15కి విచారణ మొదలైంది. రెండున్నర గంటలపాటు ప్రశ్నించిన తర్వాత లంచ్ కోసం బ్రేక్ ఇచ్చారు. తిరిగి 3.30కి విచారణకు సోనియా హాజరయ్యారు. మళ్లీ 3.30కి ఈడీ ఆఫీసుకు వచ్చిన సోనియా.. రాత్రి ఏడు గంటల సమయంలో తిరిగి వెళ్లారు. బుధవారం కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ ఆమెకు చెప్పినట్లు ఆఫీసర్లు తెలిపారు. ఈనెల 21న కూడా రెండు గంటల పాటు సోనియాను ఈడీ విచారించింది. ఈడీ అడిగిన 28 ప్రశ్నలకు కాంగ్రెస్ చీఫ్ సమాధానమిచ్చారు. మంగళవారం నాటి విచారణలో 30 దాకా ప్రశ్నలు వేసినట్లు సమాచారం.
ప్రతిపక్షాన్ని అణచాలని చూస్తున్నరు : ప్రియాంక
బీజేపీ నియంతృత్వం బయటపడిందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. పార్లమెంట్‌లో ముఖ్యమైన అంశాలు చర్చించడం లేదని, వీధుల్లో ప్రజల గొంతుకను వినిపించనివ్వడం లేదని ఆరోపించారు. విజయ్ చౌక్‌లో రాహుల్ గాంధీ రోడ్డుపై కూర్చున్న ఫొటోలను ట్వీట్ చేశారు. పోలీసులు, ఏజెన్సీల ద్వారా ప్రతిపక్షాలను అణచేయాలని నియంత ప్రభుత్వం అనుకుంటోందని విమర్శించారు.
రాహుల్ అరెస్ట్.. పోలీస్ బస్‌లో తరలింపు
సోనియా గాంధీని ఈడీ విచారించడానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీతోపాటు పలువురు కాంగ్రెస్ ఎంపీ లు విజయ్ చౌక్ వద్ద నిరసనలకు దిగారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లాలని భావించారు. కానీ పోలీసులు వారిని అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌ను ఓ పోలీస్ బస్‌లో ఎక్కించి తీసుకెళ్లారు. ‘‘ఇండియా.. ఓ పోలీస్ రాజ్యం. మోడీనే రాజు” అని రాహుల్ ఆరోపించారు. ‘‘నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. ప్రెసిడెంట్ నివాసం దగ్గరికి వెళ్లాల ని అనుకున్నం. కానీ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు” అని చెప్పారు. ‘‘నియంతృత్వాన్ని చూడండి. శాంతియుత ప్రదర్శనలు నిర్వహించలేము, పోలీసులను, ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం ద్వారా, అరెస్టులు చేయించడం ద్వారా మీరు మమ్మల్ని ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉంచలేరు. సత్యం మాత్రమే ఈ నియంతృత్వాన్ని అంతం చేస్తుంది’’ అని ట్వీట్ చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేశాయి.