
హైదరాబాద్, వెలుగు: క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీశ్, మేడ్చల్ జిల్లా షాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త బుచ్చిరెడ్డిని సోమవారం విచారించింది. ఆరేండ్ల బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ప్రశ్నించింది. ఇందులో విదేశీ అకౌంట్లకు జరిగిన ఆర్థికలావాదేవీల్లో పలు అనుమానిత ట్రాన్సాక్షన్స్ ను గుర్తించింది. వాటి ఆధారంగా క్యాసినో మనీలాండరింగ్‌పై ఆరా తీస్తోంది. ప్రధానంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై వరకు జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌ను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. గోవా, నేపాల్, సింగపూర్, హాంకాంగ్, థాయ్‌లాండ్‌లో జరిగిన క్యాసినోకు ఎంత మంది వెళ్లారనే వివరాలు రాబట్టినట్లు సమాచారం. ఫ్లైట్ టికెట్స్ బుకింగ్, టోకెన్స్ ద్వారా జరిగిన బెట్టింగ్ క్యాష్‌పై ప్రశ్నించినట్లు తెలిసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగింది. హరీశ్ నుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
హవాలాతోనే క్యాసినో క్యాష్ షేరింగ్
నిరుడు గోవా, నేపాల్‌లో చీకోటి నిర్వహించిన క్యాసినో ఈవెంట్స్‌పై ఈడీ ప్రధానంగా దృష్టి పెట్టింది. మే, జూన్ నెలల్లో జరిగిన ఈవెంట్స్‌కి హైదరాబాద్, ఏపీ నుంచి ప్రముఖులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. ఇందుకోసం చీకోటి ప్రవీణ్ ఏజెంట్స్‌తో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించారు. క్యాసినోలో బెట్టింగ్ డబ్బును హైదరాబాద్‌లోని పలువురు హవాలా వ్యాపారుల వద్ద డిపాజిట్ చేశారు. మెంబర్స్ వారీగా టోకెన్స్ ఇష్యూ చేశారు. క్యాసినో టైమ్, ప్లేస్, బెట్టింగ్ నగదు వివరాలను అందించారు. క్యాసినో సెంటర్‌లోకి వెళ్లిన వారి వద్ద కేవలం రూ.15 వేలు మాత్రమే అనుమతించారు. గెలిచిన వారు హైదరాబాద్‌లోనే డబ్బు కలెక్ట్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇలా పూర్తిగా హవాలా రూపంలోనే క్యాసినో బెట్టింగ్ దందా నిర్వహించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే థాయ్‌లాండ్, నేపాల్, హాంకాంగ్, సింగపూర్‌ల నుంచి మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది.
చీకోటి నెట్‌వర్క్‌లో తలసాని బ్రదర్స్
చీకోటి ప్రవీణ్ క్యాసినో నెట్‌వర్క్‌లో సికింద్రాబాద్ కు చెందిన రాజకీయ, వాణిజ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. హరీశ్ అకౌంట్స్ నుంచి టికెట్‌బుకింగ్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ ఆధారంగా ప్రశ్నించింది. హవాలా రూపంలోనే క్యాసినో బెట్టింగ్ జరిగినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఇందులో భాగంగానే గతవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేశ్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, ఏపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ శనివారం విచారణ సమయంలో అస్వస్థతకు గురికావడంతో వాయిదా వేశారు. మరోసారి నోటీసులు ఇచ్చి విచారించేందుకు షెడ్యూల్‌ప్రిపేర్ చేశారు.
విదేశాల్లో లీగల్ కావడమే అదనుగా
క్యాసినో బెట్టింగ్ అంతా హైదరాబాద్ కేంద్రంగానే సాగింది. గోవా, నేపాల్, థాయ్‌లాండ్, హాంకాంగ్ సహా ఇతర దేశాల్లో క్యాసినో లీగల్ కావడంతో విదేశాల్లో ఎక్కువగా క్యాసినోలు నిర్వహించారు. సికింద్రాబాద్, బేగంబజార్, బేగంపేట్‌లోని పలువురు హవాలా వ్యాపారులు, ట్రావెల్ ఏజెంట్స్ నుంచి మనీ ట్రాన్సాక్షన్స్ జరిపారు. క్యాసినో ఈవెంట్స్ కోసం ముందుగానే ప్రచారం చేశారు. ప్రవీణ్ అండ్ కో గ్రూప్‌లో వాట్సాప్, ఇన్‌స్టాలో ఈవెంట్స్ ఇన్విటేషన్స్ పంపించారు. టాలీవుడ్, బాలీవుడ్ నటులతో ప్రచారం చేశారు. ప్యాకేజీలను ముందుగానే ప్రకటించారు. క్యాసినో టికెట్బుకింగ్దగ్గర నుంచి ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో అకామిడేషన్, రిటర్న్ జర్నీ వరకు స్పెషల్ ప్యాకేజ్‌లు ఇచ్చారు.
చీకోటి క్యాసినోలో నాకు వాటా ఉంది
చీకోటి క్యాసినోలో నాకు 5 శాతం వాటా ఉంది. క్యాసినో కేసులో మొత్తం డబ్బు హైదరాబాద్‌లోనే డిపాజిట్ చేయాలి. అమౌంట్ కూడా ఇక్కడే తీసుకోవాలి. మేము 10 మందిమి నేపాల్ వెళ్లాం. కేవలం రూ.15 వేలు మాత్రమే క్యాసినోకు అనుమతి ఉంటుంది. నేను తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ సరిగా లేవని మళ్లీ తెమ్మన్నారు. హవాలా మనీ లాండరింగ్ విషయాలు మాకు తెలియదు. తలసాని పీఏ హరీశ్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు.
-బుచ్చిరెడ్డి, వ్యాపారవేత్త, చీకోటి పార్ట్‌నర్