
చెన్నై: తమిళనాడు మంత్రి పెరియసామి, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లలో శనివారం ఈడీ అధికారులు దాడులు చేశారు. చెన్నై గ్రీన్ వేస్ రోడ్డులోని ఆయన నివాసం, తిరువల్లికేనిలోని ఎమ్మెల్యే అతిథి గృహం, మధురై, దిండిగల్‌తో సహా పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. దాడుల్లో భాగంగా ఈడీ అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నారు. మంత్రి పెరియసామికి చెందిన కొంతమంది అనుచరులు ఈడీ అధికారులను గ్రీన్ వేస్ రోడ్డులోని ఆయన ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులను భారీగా మోహరించారు. అనుమానిత మనీలాండరింగ్, అక్రమ ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. అందులో భాగంగానే మంత్రి, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లపై దాడులు చేసింది.