
గొర్రెల పంపిణీ స్కాం పై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ వేగవంతం చేసింది. గొర్రెల పంపిణీ పథకం అక్రమాల విలువ రూ.1000 కోట్లు పైనే ఉంటుందని శుక్రవారం (ఆగస్టు 1) - ఈడీ ప్రకటన విడుదల చేసింది. వివిధ జిల్లాల్లో ఈ స్కీం కింద ఎంత మేరకు అక్రమాలు జరిగాయో పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. 200 కు పైగా బ్యాంకు ఖాతాలకు చెందిన పాస్ బుక్కులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ బ్యాంకు ఖాతాలు ఆన్ లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ లోనూ ఉపయోగించినట్లు పేర్కొన్నారు. సోదాల అనంతరం 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా 200కు పైగా ఫేక్ అకౌంట్లకు సంబంధించిన ATM కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో కాగ్ ఇచ్చిన నివేదికలో కేవలం ఏడు జిల్లాల్లోనే రూ.253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఉందని.. 33 జిల్లాలు కలిపి చూస్తే రూ.1000 కోట్లకు పైబడే గొర్రెల పంపిణీ అక్రమాలు జరిగి ఉంటాయని తెలిపారు. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు వెల్లడించారు.
గొర్రెల పంపిణీ స్కీం లో లబ్ధిదారులు అసలు గొర్రెల వ్యాపారంతో సంబంధం లేనివారు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అసలు గొర్రెల కొనుగోలు లేదా విక్రయం జరగలేదని.. కానీ వెయ్యి కోట్ల రూపాయలు మాయం చేసినట్లు పేర్కొన్నారు. నకిలీ విక్రేతలు, ఫేక్ బిల్లులను మళ్లీ మళ్లీ పేర్కొంటూ డబ్బులు దోచుకున్నట్టు ఆధారాలు గుర్తించారు. ఈడీ సోదాల్లో ప్రభుత్వ అధికారులకు, ఇతరులకు కిక్‌బ్యాక్ లకు సంబంధించిన డాక్యుమెంట్లు, నకిలీ చెక్ బుక్‌లు, పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.