
హైదరాబాద్, వెలుగు : చేపల చెరువుల నిర్మాణం పేరుతో కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ)లపై రుణాలు తీసుకుని మోసానికి పాల్పడిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏపీ, తెలంగాణలోని ఆరు ప్రాంతాల్లో గత బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించింది. మొత్తం రూ.311.05 కోట్ల రుణాలు తీసుకుని దారిమళ్లించినట్లుగా గుర్తించింది. కేసు వివరాలను ఈడీ అధికారులు శనివారం మీడియాకు వెల్లడించారు. ఈడీ అధికారులు పేర్కొన్న ప్రకారం.. రాజమండ్రిలోని ఐడీబీఐ బ్యాంక్‌లో కిసాన్ క్రెడిట్ కార్డులపై రుణాల పేరిట భారీ స్కామ్ జరిగింది.
సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఖాతాదారుల నుంచి కేవైసీ డాక్యుమెంట్లు, బ్లాంక్ చెక్కులు, మరికొందరు రైతుల నుంచి వారికి సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించారు. స్వల్పకాలిక రుణాలు, చేపల, రొయ్యల చెరువుల నిర్మాణం పేరిట రూ.311.05 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఈ డబ్బుతో తమ సొంత కంపెనీల్లో పెట్టుబడులు, కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఆస్తుల కొనుగోలు చేశారు. అయితే, ఆడిట్‌లో అసలు విషయం బయటపడడంతో ఏసీబీ విభాగం కేసు నమోదు చేసింది.
ఈ కేసులో మనీలాండరింగ్ వ్యవహారానికి సంబంధించి ఈడీ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 29న తెలంగాణ, ఏపీలోని ఆరు ప్రాంతాల్లో రెయిడ్స్ నిర్వహింయి, కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు వివరించారు.