బీఆర్ఎస్ ​ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

బీఆర్ఎస్ ​ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
  • ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి, బంధువుల ఇండ్లు, ఆఫీసుల్లోనూ..
  • మొత్తం 10 ప్రాంతాల్లో తనిఖీలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
  • అక్రమ మైనింగ్, మనీలాండరింగ్ ఆరోపణలతో కేసు నమోదు  
  • రూ.341 కోట్ల సీనరేజీ ఎగ్గొట్టడంతో మధుసూదన్ రెడ్డిపై గతంలో కేసు  
  • ఇయ్యాల కూడా తనిఖీలు కొనసాగే చాన్స్

హైదరాబాద్ / సంగారెడ్డి, వెలుగు:  పటాన్‌‌‌‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌‌‌‌ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌‌‌‌ రెడ్డి వ్యాపారాలపై ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ) నజర్ పెట్టింది. అక్రమ మైనింగ్‌‌‌‌, మనీలాండరింగ్‌‌‌‌ ఆరోపణలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.  ఇందులో భాగంగా గురువారం పటాన్‌‌‌‌‌‌‌‌చెరులోని మహిపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇంటితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, బంధువులు, బినామీల ఇండ్లు, ఆఫీసుల్లో ఒకేసారి సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం10 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. కీలక డాక్యుమెంట్లు, మైనింగ్ రికార్డులను స్వాధీనం చేసుకుంది. కాగా, శుక్రవారం కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. 

అక్రమాస్తులపై ఈడీకి ఫిర్యాదులు..

సంతోష్ మైన్స్ పేరుతో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి పటాన్ చెరు మండలం లక్డారం గ్రామ సరిహద్దుల్లో మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 72.87 లక్షల టన్నుల మైనింగ్​చేసి, 8.48 లక్షల టన్నులకు మాత్రమే సీనరేజీ చెల్లించినట్టు మైనింగ్​ఆఫీసర్లు తేల్చారు. దీంతో సీనరేజీ, పెనాల్టీ కలిపి మొత్తం రూ.341 కోట్లు చెల్లించాలని మధుసూదన్ రెడ్డికి గతంలో నోటీసులు జారీ చేశారు. దీనికి తోడు అనుమతులకు మించి ప్రభుత్వ భూముల్లో అనధికారిక తవ్వకాలు జరిపారనే ఆరోపణలతో సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి, సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ కమిటీ  విచారణ చేపట్టింది. అనంతరం స్థానిక తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదు మేరకు మధుసూదన్‌‌‌‌‌‌‌‌ రెడ్డిపై పటాన్‌‌‌‌‌‌‌‌చెరు పోలీసులు ఈ ఏడాది మార్చిలో కేసు ఫైల్ చేశారు. మధుసూదన్‌‌‌‌‌‌‌‌రెడ్డిని అరెస్టు చేయగా, బెయిల్ పై బయటకొచ్చాడు. ఈ క్రమంలో బినామీల పేరుతో మధుసూదన్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టారని ఈడీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. 

మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌పై ఆరా..  

మధుసూదన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అక్రమ మైనింగ్ చేసినట్టు టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ కమిటీ విచారణలో తేలింది. దీనిపై పటాన్‌‌‌‌‌‌‌‌చెరు పోలీసులు కేసు నమోదు చేయగా, దాని ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసింది. మధుసూదన్‌‌‌‌‌‌‌‌ రెడ్డితో పాటు ఎమ్మెల్యే మహిపాల్‌‌‌‌‌‌‌‌ రెడ్డికి సంబంధించిన వ్యాపారాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మహిపాల్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అల్లుడు ఇటీవల రూ.3 కోట్లతో ల్యాండ్​క్రూజర్ కారు కొన్నారని గుర్తించారు. ఇందుకు సంబంధించి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలోనూ సమాచారం సేకరించినట్టు తెలిసింది. 

ఇది రాజకీయ కుట్ర: మహిపాల్ రెడ్డి 

రాజకీయ కుట్రతోనే తనపై ఈడీ దాడులు చేయిస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆరోపించారు. ‘‘ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. ఇకపైనా ఎదుర్కొంటాను. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. తనిఖీలకు సంపూర్ణంగా సహకరించాను. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఈడీ, ఐటీ శాఖల పేరుతో దాడులు చేయిస్తున్నాయి”అని ఆయన అన్నారు.