ప్రత్యేకావసరాల పిల్లలను పట్టించుకుంటలేరు!

ప్రత్యేకావసరాల పిల్లలను పట్టించుకుంటలేరు!

వనపర్తి టౌన్, వెలుగు: అంగవైకల్యం, చెవుడు, మానసిక ఎదుగుదల లేకపోవడం.. తదితర లోపాలు ఉన్న పిల్లలను విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. వీరి కోసం ప్రభుత్వం  సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో భవిత, ఐఈఆర్సీ సెంటర్లను ఏర్పాటు చేసి,  కోర్డినేటర్లను నియమించింది. అయినా.. కనీసం పర్యవేక్షణ చేయడం లేదు.  ఈ సెంటర్లలో ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లను నియమించి ప్రత్యేకావసరాల పిల్లలకు విద్యతో పాటు  ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటోంది.  కానీ, ఇవేమీ పట్టించుకోవడం లేదు. కనీసం ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్‌‌‌‌‌‌‌‌ షిప్స్‌‌‌‌, అలవెన్స్‌‌‌‌లు కూడా ఇవ్వడం లేదు.  

రెండేళ్లుగా ఫిజియోథెరపీ సేవలు బంద్ 

వనపర్తి జిల్లాలో 3 భవిత, 11 ఐఈఆర్సీ(ఇన్‌‌‌‌క్లూజివ్ ఎడ్యూకేషన్ ఆఫ్ రీసోర్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌)లు ఉన్నాయి. వీటిలో ప్రత్యేక శిక్షణ పొందిన 15 మంది ఐఈఆర్పీ టీచర్లు పనిచేస్తున్నారు.  ప్రస్తుతం చిన్నంబావి, రేవల్లి, మదనాపురం మండలాల్లో ఐఈఆర్పీ టీచర్‌‌‌‌ పోస్టులు ఖాళీ ఉండడంతో అక్కడ సెంటర్లు మూతపడ్డాయి. జిల్లాలో గతంలో 9 ఉమ్మడి మండలాలకు ఇద్దరు ఫిజియోథెరపిస్టులు ఉండగా ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారు.  

దీంతో రెండేళ్లుగా కేవలం పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మండలాల్లోని స్టూడెంట్లకు మాత్రమే ఫిజియోథెరపీ కొనసాగుతోంది. మిగిలిన మండలాలకు గత రెండేళ్లుగా ఫిజియోథెరపిస్ట్ సేవలు అందడం లేదు. దీంతో పాటు  రెండేళ్లుగా ప్రత్యేక అవసరాల స్టూడెంట్లకు ఇచ్చే స్కాలర్ షిప్‌‌‌‌లు, ఎస్కార్ట్, ట్రాన్స్ ఫోర్ట్ అలవెన్స్‌‌‌‌లు సైతం అందడం లేదు.  అయినా డీఈవో గానీ,   కోఆర్డినేటర్ గానీ పట్టించుకోవడం లేదు.

కొరవడిన పర్యవేక్షణ...

భవిత, ఐఈఆర్సీ సెంటర్లపై జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదు. డీఈవో రవీందర్ వనపర్తి జిల్లాకు చుట్టపు చూపుగా వచ్చిపోతూ.. ఇన్‌‌‌‌చార్జి బాధ్యతలు ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలోనే ఎక్కువగా ఉంటున్నారు.  దీంతో కిందిస్థాయి అధికారులు పర్యవేక్షణ గాలికి వదిలేయడంలో ఐఈఆర్పీ టీచర్లు కాగితాలపై కాకి లెక్కలు రాసుకుంటున్నారు.  ప్రతియేడు బడిబాట మాదిరిగా సర్వే చేసి ప్రత్యేకావసరాలున్న పిల్లలను గుర్తిస్తున్నా.. సెంటర్లకు మాత్రం తీసుకురావడం లేదు. 

జిల్లాలో 1,119 మంది పిల్లలు..

జిల్లాలోని 14 మండలాల్లో 1,119 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించారు. ఇందులో 134 మంది మాత్రమే ఐఈఆర్సీ సెంటర్లకు వస్తున్నారని,   మరో 60 మంది స్టూడెంట్లకు ఇంటి వద్దే పాఠాలు చెబుతున్నట్లు  అధికారులు చెబుతున్నారు.  కానీ, వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. వనపర్తి టౌన్‌‌‌‌లోని  భవిత కేంద్రంలో రెండు సెంటర్లకు చెందిన స్టూడెంట్లు 17 మంది ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నా.. కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు.  కొత్తకోటలో 20, ఘనపురంలో 9 మంది వస్తున్నారని చెబుతున్నా ఇందులో సగం మంది కూడా రావడం లేదు.  మిగతా 11 ఐఈఆర్సీ సెంటర్లు గవర్నమెంట్ స్కూళ్లల్లో నిర్వహిస్తుండడంతో ఐఈఆర్పీ టీచర్లను ఆయా స్కూళ్ల హెచ్ఎం లు, ఎంఈవోలు తమ ఆఫీస్ పనులను వాడుకుంటున్నట్లు తెలిసింది.  

ఫిజియోథెరపిస్ట్ లేని విషయం వాస్తవమే

జిల్లాలో రెండేళ్లుగా ఫిజియోథెరపిస్ట్ లేని మాట నిజమే. గతంలో ఇద్దరు ఉండగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ఆయనతోనే నాలుగు మండలాల్లో ఫిజియోథెరపీ చేయిస్తున్నం. త్వరలోనే ఫిజియోథెరపిస్ట్ ను నియమించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. జిల్లాలో ప్రత్యేక అవసరాల స్టూడెంట్లకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తం. - యుగంధర్, ఐఈఆర్పీ కోఆర్డినేటర్,  వనపర్తి