
తాడ్వాయి, వెలుగు: విద్యతోనే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండేలాతోగు గుత్తి కోయగుంపు లో కొత్తగా నిర్మించిన స్కూల్‌ను కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య నేర్చుకోవడం ద్వారా నిరాక్షరాస్యతను రూపుమాపాలన్నారు. గుత్తికోయగూడేల్లో చిన్నారులకు విద్య అందించాలని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పూనుకుందన్నారు. కానీ ఈ ప్రాంతం అభయారణ్యంలో ఉండడంతో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ నుంచి పర్మిషన్లనకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఈ ప్రాంతంలోని పిల్లలకు విద్యను అందించాలనే సంకల్పంతో ఎన్‌జీవోలు, ప్రైవేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఇక్కడ స్కూల్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సీహెచ్ మహేందర్ జీ, లైబ్రరీ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, డీఎస్పీ రవీందర్, చక్రవర్తి హాస్పిటల్ ఎండీ తరుణ్ రెడ్డి, మండల అధికారులు, ఎన్‌జీవో సంతోష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.