
ముషీరాబాద్,వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి, కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాసిందని ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. కొత్త ప్రభుత్వం విద్యా రంగాన్ని గాడిలో పెట్టాలని కోరారు. పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం, పెండింగ్ స్కాలర్ షిప్ లు , ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని, కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ అధ్యక్షతన సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ముఖ్య అతిథిగా కోదండరాం హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో చదివే విద్యార్థులకు మూడు పూటలా భోజనాలు పెట్టాలని కోరారు. వర్సిటీలో స్వయం ప్రతిపత్తిని మరింత పెంచి, విద్యార్థులకు ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగులుగా తయారు చేయాలని కోరారు. గత ప్రభుత్వం లెక్కనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేయకుండా విద్యారంగాన్ని తక్షణమే బాగు చేయాలని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సూచించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, ఓయూ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు, పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మమత, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.