ఎన్ఈపీతో సమూల మార్పులు.. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ఎన్ఈపీతో  సమూల మార్పులు.. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

హైదరాబాద్, వెలుగు: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం హైదరాబాద్​లోని స్టాన్లీ ఉమెన్స్ కాలేజీలో బండారు వైష్ణవ్ మెమోరియల్ ఫౌండేషన్, స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీ సంయుక్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్​గా హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశ తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలామ్ ఆజాద్ విద్యను జాతి అభివృద్ధికి మూలాధారంగా చూశారని గుర్తుచేశారు. విద్య మనిషికి కేవలం ఉద్యోగం కోసమే కాకుండా ఆలోచన, మనోదైర్యం, దేశభక్తి పెంచేందుకు సహకరిస్తోందన్నారు.

 ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి, ఓయూ మాజీ వీసీ డి. రవీందర్, ఎస్వీ వర్సిటీ మాజీ వీసీ కొలననూరి ఇనాక్, స్టాన్లీ కాలేజీ కరస్పాండెంట్ కె. కృష్ణారావు, డైరెక్టర్ వీ. అనురాధ, రాకేశ్ రెడ్డి, ఆర్. ప్రదీప్ రెడ్డి, బీఎల్ రాజు పాల్గొన్నారు.