మా భూములు మాకే కావాలి..ఏదుల మండల రైతుల ధర్నా

మా భూములు మాకే కావాలి..ఏదుల మండల రైతుల ధర్నా

రేవల్లి/ఏదుల, వెలుగు: గొల్లపల్లి రిజర్వాయర్  ప్రపోజల్​ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్  చేస్తూ ఏదుల మండల రైతులు ఆందోళనకు దిగారు. అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో గొల్లపల్లి, చీర్కపల్లి, చెన్నారం గ్రామస్తులు, రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఏదుల వీరాంజనేయ స్వామి ప్రాజెక్ట్  ద్వారా సాగునీటిని అందించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం కొత్త రిజర్వాయర్  నిర్మించాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. 

డి5 కాలువలు వంద ఫీట్ల దూరంలోనే ఉన్నాయని, డి8 కెనాల్‌‌‌‌ను ఆనుకొని ఒక తూము ద్వారా లింక్  చేస్తే ఘనపూర్, బుద్ధారం కాలువలకు నీరు ఇవ్వొచ్చని తెలిపారు. కొత్త రిజర్వాయర్  వల్ల మూడు గ్రామాల్లో 1,200 ఎకరాల సాగుభూమి కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను విస్మరిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అర్జున్ రావు, జానయ్య, శ్రీవర్ధన్ రెడ్డి, గడ్డిగోపుల మహేశ్, దొడ్ల రాములు, విజయ్ మోహన్, సునీల్ కుమార్, రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.