
- గతంలో ఏడుపాయల ఆలయంలో నగలు, నగదు చోరీ
- తాజాగా బంగారం, వెండి |ఈఓ ఇంటికి తీసుకెళ్లడం వివాదాస్పదం
- ఆలయ చైర్మన్, ఈవో మధ్య కోల్డ్‌వార్?
మెదక్, పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆభరణాలకు భద్రత కరువైందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలు మార్లు ఆలయంలో నగలు, నగదు చోరీకి గురయ్యాయి. తాజాగా ఆలయానికి సంబంధించిన బంగారం, వెండిని నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ఈఓ తన ఇంటికి తీసుకెళ్లడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదివరకు ప్రభుత్వం ఏడుపాయల ఆలయానికి కొత్త ఈఓను నియమించగా, ఆయనను ఇక్కడ పని చేయనీయకుండా పంపించడం విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత ఈఓ, ఆలయ కమిటీ చైర్మన్ మధ్య కోల్డ్వార్నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయం వద్ద భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించకపోగా రాజకీయ జోక్యం ఎక్కువైందనే ఆరోపణలున్నాయి.
6ఏ జాబితాలో ఆలయం కానీ..
ఏడుపాయల ఆలయం 6ఏ జాబితాలో ఉంది. ఆలయానికి టెండర్లు, సత్రాల అద్దెలు, దుకాణాల కిరాయిలు, వాహన పూజలు, దర్శనం టికెట్లు, ప్రసాదం విక్రయాలు, హుండీలో భక్తులు సమర్పించే కానుకల ద్వారా ఏటా సుమారు రూ.7 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. కానీ అమ్మవారి ఆభరణాలకు భద్రత లేకుండా పోయింది. 2020 నవంబర్‌లో గర్భగుడి కడప వెండి తొడుగు ఆఫీస్‌లో నుంచి చోరీకి గురైంది. 2022 జనవరి 20న ఓ దొంగ గర్భగుడిలోని హుండీ పగలగొట్టి రూ.2.96 లక్షల విలువైన నగదు, భక్తులు సమర్పించిన బంగారు, వెండి కానుకలు ఎత్తుకు పోయాడు.
ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా..
తాజాగా ఆలయానికి సంబంధించిన బంగారం, వెండి నిబంధనలకు విరుద్ధంగా ఈవో తన ఇంటికి తీసుకెళ్లడం వివాదస్పదమైంది. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన 2 కిలోల 271 గ్రాముల బరువైన బంగారు ఆభరణాలు, 130 కిలోల 391 గ్రాముల బరువైన వెండి ఆభరణాలను కరిగించేందుకు 2020 జూన్ 4వ తేదీన హైదరాబాద్ మింట్కంపౌండ్కు తీసుకెళ్లారు. వాటిని కరిగించిన తరువాత ముద్ద బంగారం 1 కిలో 939 గ్రాములు, వెండి 72 కిలోల 513 గ్రాములను శుక్రవారం ఆలయ ఈఓ శ్రీనివాస్ మింట్ కంపౌండ్ నుంచి మెదక్ తీసుకొచ్చారు. కాగా బంగారం, వెండిని బ్యాంక్ లాకర్లో భద్ర పరచాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఈఓ తన ఇంటి వద్దకు తీసుకెళ్లడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం
ఏడుపాయల ఆలయానికి సంబంధించిన బంగారం, వెండిని ఈఓ బ్యాంక్ లాకర్లో భద్ర పరచకుండా తన ఇంటి వద్దకు తీసుకెళ్లిన వ్యవహారంపై ఎండోమెంట్ రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్ జే సీ) రామకృష్ణారావు, ఆభరణాల తనిఖీ అధికారిణి అంజనాదేవి, ఉమ్మడి మెదక్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్ శనివారం మెదక్ చేరుకుని ఎంక్వైరీ చేశారు. బంగారం, వెండి కరిగించేందుకు మింట్ కంపౌండ్‌కు ఎప్పుడు పంపారు, అక్కడి నుంచి మెదక్ ఎప్పుడు తెచ్చారు అనేదానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆర్జేసీ మాట్లాడుతూ ఈఓ సెక్యూరిటీ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా బంగారం, వెండిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ విషయమై ఎండోమెంట్ కమిషనర్‌కు నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
ఆలయం ప్రతి అకౌంట్ వెరిఫై చేయాలి
సమాచారం ఇవ్వకుండా ఆలయానికి సంబంధించిన బంగారం, వెండిని మింట్ కంపౌండ్ నుంచి తీసుకురావడం సరికాదు. ఈవో ఒక్కరికే చెక్ పవర్ ఉండటం వల్ల అతను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన అకౌంట్ మెదక్ ఇండియన్ బ్యాంక్ లో ఉండగా, దానికి సంబంధించిన వివరాలు పాలక వర్గానికి చెప్పడం లేదు. ఆలయానికి సంబంధించిన ప్రతి అకౌంట్ వెరిఫై చేయాలి.
- బాలాగౌడ్, ఆలయ కమిటీ చైర్మన్
ఆలస్యం కావడం వల్లే..
మింట్ కంపౌండ్ నుంచి కరిగించిన బంగారం, వెండి తీసుకుని మెదక్ వచ్చే సరికి శుక్రవారం రాత్రి10:30 అయింది. బ్యాంక్ మేనేజర్ కు ఫోన్ చేస్తే తనకు జ్వరం ఉందని బ్యాంకుకు రావడం కుదరదన్నారు. పోలీస్ స్టేషన్లో లాకర్ సదుపాయం లేకపోవడంతో, తన కారులో ఇంటికి తీసుకెళ్లాను.ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా, ఐదుగురు కానిస్టేబుళ్లను తన ఇంటి వద్ద బందోబస్తు నియమించారు. శనివారం పొద్దున బంగారం, వెండిని పోలీసుల సమక్షంలో బ్యాంక్ లాకర్ లో భద్రపరిచాం. - సారా శ్రీనివాస్, ఈఓ