జలదిగ్బంధంలో వనదుర్గ భవానీ మాత ఆలయం

 జలదిగ్బంధంలో వనదుర్గ భవానీ మాత ఆలయం

పాపన్నపేట, వెలుగు: మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతోపాటు సింగూర్​ ప్రాజెక్ట్​గేట్లు ఎత్తి  ఆఫీసర్లు నీటిని విడుదల చేయడంతో వనదుర్గ ప్రాజెక్ట్​ పొంగి పొర్లుతోంది. ఆనకట్ట పైనుంచి గంగమ్మ భారీ ఎత్తున ఎగసిపడుతూ దుర్గమ్మ ఆలయాన్ని చుట్టుముట్టి నిజాంసాగర్​ వైపు పరుగులు తీస్తోంది. ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఎండోమెంట్​ఆఫీసర్లు దుర్గమ్మ ఉత్సహ విగ్రహాన్ని రాజగోపురంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ బాలస్వామి ఏడుపాయలను సందర్శించారు. అనంతరం  ఆలయం, ప్రాజెక్ట్​ వద్ద ప్రవహిస్తున్న వరదనీటిని పరిశీలించారు. భక్తులు నదీ పరివాహక ప్రాంతంలోకి వెళ్లకుండా ఆలయ   సిబ్బందికి, పోలీసులకు సూచనలు అందజేశారు. ఆయన వెంట ఆలయ చైర్మన్ బాలాగౌడ్​, కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్, ఆలయ సిబ్బంది ఉన్నారు.

మహారాష్ట్రకు నిలిచిన రాకపోకలు

బోధన్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని మంజీర నది రాతి బ్రిడ్జి పైనుంచి వరద నీళ్లు పారుతుండడంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. నిజాంసాగర్​ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరలోకి భారీగా ప్రవాహం వస్తోంది. కొత్త బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడడంతో ఏడాదిగా భారీ వెహికల్స్​ రాకపోకలు నిలిపివేశారు. రాతి బ్రిడ్జిపై వెహికల్స్​ వెళుతున్నాయి. ప్రస్తుతం రాతి బ్రిడ్జిపై వరద నీళ్లు పారుతుండడంతో వెహికల్స్ ​వెళ్లకుండ రోడ్డుపై జేసీబీతో గుంత తవ్వారు. దీంతో ఇరురాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర వెళ్లే ప్రయాణికులు బాసర బ్రిడ్జి పైనుంచి వెళ్లాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.