
కరాచీ: పాకిస్తాన్‌కు ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్) ప్రోగ్రామ్ కింద అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) రెండో విడతగా 1.023 బిలియన్ డాలర్ల (100 కోట్ల డాలర్లు) రుణాన్ని విడుదల చేసింది. పాకిస్తాన్త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై ఐఎంఎఫ్ వర్చువల్ మీటింగ్ ప్రారంభించిన ఒకరోజు తర్వాత ఈ రుణాన్ని విడుదల చేసింది.ఈ మేరకు ఐఎంఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ రుణ సంస్థల నుంచి తీసుకున్న అప్పులను చెల్లించకుండా.. ఆ డబ్బుతో సీమాంతర ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్‌కు కొత్తగా రుణం ఇవ్వొద్దంటూ భారత్ తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పినా ఫలితం లేకుండాపోయింది.
దేశంలో నెలకొన్న భద్రతా ఆందోళనల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో ఐఎంఎఫ్ మిషన్ పర్యటన వాయిదా పడగా.. ఐఎంఎఫ్ మిషన్ మే 16 వరకు పాక్ ప్రభుత్వంతో వర్చువల్‌గా సమావేశాలు నిర్వహిస్తున్నది. కాగా, రెండో విడత కింద తాము విడుదల చేసిన సాయం పాక్ విదేశీ మారక నిల్వల్లో పెరుగుదలను చూపుతాయని ఐఎంఎఫ్ తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వం 2025–-26 ఆర్థిక సంవత్సరానికి జూన్ 2న బడ్జెట్‌ను ప్రకటించాలని యోచిస్తున్నది. కాగా, ఈఎఫ్ఎఫ్ కింద గత వారమే ఐఎంఎఫ్ పాకిస్తాన్‌కు రెండో విడత రుణసాయాన్ని ఆమోదించింది. అలాగే, రెసిలెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ కోసం 1.4 బిలియన్ డాలర్లు అదనంగా ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.