- పరకాల నియోజకవర్గ పరిధిలోని దామెరలో ఏర్పాటుకు కసరత్తు
- ఇప్పటికే ఆరు మండలాల్లో 53 సొసైటీలు, 3,165 సభ్యుల గుర్తింపు
- 75 కలెక్షన్ సెంటర్లతో ప్రస్తుతానికి 8,500 లీటర్ల పాల సేకరణకు ప్లాన్
- పదెకరాల్లో రూ.32 కోట్లతో బిల్డింగ్ నిర్మాణానికి ప్రతిపాదనలు
- పాలు, పాల ఉత్పత్తుల బిజినెస్ తో మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదం
హనుమకొండ, వెలుగు: మహిళల స్వయంకృషికి వారు సాధించిన విజయాలకు నిదర్శనం 'స్వకృషి' ముల్కనూరు మహిళా సహకార డెయిరీ. దాదాపు 23 ఏండ్ల కింద ప్రారంభమై పాలు, వాటి ఉత్పత్తుల బిజినెస్ లో దేశానికే రోల్ మోడల్ గా నిలిచి, వేలాది మంది మహిళలను ఆర్థిక బాట పట్టించింది. ఇప్పుడు అదే డెయిరీ స్ఫూర్తితో హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెరలో మరో డెయిరీ ఏర్పాటు కాబోతోంది.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రత్యేక చొరవతో 'పరకాల ఇందిరా మహిళా డెయిరీ' ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. సెర్ప్, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే నియోజకవర్గంలోని మహిళల ఆధ్వర్యంలో 'ముల్కనూరు' తరహాలోనే మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్ బిజినెస్ రన్ అవనుంది.
దేశంలోనే నెంబర్ వన్‌గా ముల్కనూరు డెయిరీ..
ముల్కనూరు స్వకృషి మహిళా సహకార డెయిరీని 2002లో దాదాపు రూ.3.30 కోట్లతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని దాదాపు 70 గ్రామాలకు చెందిన 5,200 మందితో ఏర్పాటు చేశారు. ఇందులోని సభ్యులంతా పాలను సేకరించి, పాశ్చరైజేషన్ చేయడంతోపాటు పెరుగు, నెయ్యిలాంటి పాల ఉత్పత్తులు తయారు చేయడం, వాటిని ప్యాక్ చేసి, మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఏటా రూ.కోట్లలో బిజినెస్ చేస్తుండటంతో ముల్కనూరు సొసైటీ అనతికాలంలోనే దేశంలో నెంబర్ వన్ మహిళా డెయిరీగా గుర్తింపు సాధించి, ఎన్నో అవార్డులు కూడా పొందింది.
ప్రస్తుతం ముల్కనూరు మహిళా డెయిరీలో 23,570 మందికిపైగా సభ్యులు ఉండగా, ఏటా రూ.180 కోట్లకు పైగా బిజినెస్ నడుస్తుంది. ఇప్పటివరకు 1,725 కోట్ల వ్యాపారం జరగడం గమనార్హం. అంతేగాక డెయిరీ లాభాల్లో ఏటా రూ.15 కోట్ల వరకు సభ్యులకు బోనస్ రూపంలో అందిస్తుండటం విశేషం. ఇప్పుడు అదే స్ఫూర్తితో పరకాల ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
ఎమ్మెల్యే రేవూరి స్పెషల్ ఫోకస్..
ముల్కనూరు డెయిరీని ఆదర్శంగా తీసుకుని హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న పరకాల నియోజకవర్గంలో మహిళా డెయిరీ ఏర్పాటుపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫోకస్ పెట్టారు. సెర్ప్, ఎన్డీడీబీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలోని దామెరలో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు. గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రతిరోజు 1.70 లక్షల లీటర్ల పాలను వినియోగిస్తుండగా, మిగతా డెయిరీలకు దీటుగా పరకాల డెయిరీ నుంచి మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్ అందించేలా ఆఫీసర్లతో ప్రణాళికలు రూపొందించారు.
డెయిరీ ఏర్పాటుకు అవసరమైన 10 ఎకరాల స్థలాన్ని గుర్తించడంతో పాటు రూ.32 కోట్లతో పర్మినెంట్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రపోజల్స్ పెట్టారు. ఇదిలాఉంటే సెర్ప్, ఎన్డీడీబీ ప్రతినిధులు నియోజకవర్గంలోని పశుసంపద, పాల ఉత్పత్తి, మార్కెటింగ్, డెయిరీ నిర్వహణకు కలిసివచ్చే అంశాలపై దాదాపు రెండు నెలల కిందటే స్టడీ చేసి వెళ్లారు.
'ముల్కనూరు'తో టైఅప్..
దామెరలో పర్మినెంట్ స్ట్రక్షర్ ఏర్పాటయ్యేంత వరకు ముల్కనూరు సొసైటీతో టైఅప్ అయి డెయిరీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో హనుమకొండ జిల్లా పరిధిలోని ఆత్మకూరు, దామెర, నడికూడ, పరకాల, వరంగల్ జిల్లా పరిధిలోని సంగెం, గీసుగొండ మండలాల్లోని 102 గ్రామాల్లో 3,165 మందితో 53 సొసైటీలు ఏర్పాటు చేశారు. వారి నుంచి వాటాధనం, పొదుపు సొమ్ము స్వీకరించి సభ్యత్వం కల్పించారు.
ఇప్పటికీ సభ్యత్వాల డ్రైవ్ కొనసాగిస్తున్నారు. కాగా సభ్యులందరికీ పాల సేకరణ నుంచి బ్రాంచ్ మిల్స్ సెంటర్లు, డెయిరీకి తరలింపు అంశాలపై ముల్కనూరు డెయిరీలో ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఈ ఆరు మండలాల్లో 5,891కిపైగా పాడి పశువులు ఉండగా, 8,500 లీటర్లకుపైగా పాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పాలను సేకరించేందుకు 75 కలెక్షన్ సెంటర్లను కూడా ప్రపోజ్ చేశారు. ఆయా సెంటర్ల నుంచి తొందర్లోనే పాల సేకరణ ప్రారంభించి, దామెరలో డెయిరీ ఓపెన్ అయ్యేంతవరకు వాటిని ముల్కనూరు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్కడి నుంచే పాలు, పెరుగు, నెయ్యిలాంటి ఉత్పత్తులను పరకాల డెయిరీ పేరుతో ప్యాకింగ్ చేసి, సప్లై చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ముందుగా పరకాల, నడికూడ, గుడెప్పాడ్, సంగెం, గీసుగొండలో బ్రాంచ్ మిల్క్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మలి విడతలో గేదెల పంపిణీ..!
ఇప్పటికే డెయిరీ ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకోగా, పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీశ్ తోపాటు డీఆర్డీవో, డీసీవో, వెటర్నరీ ఆఫీసర్లు కృషి చేస్తున్నారు. ఇందిరా మహిళా డెయిరీ స్కీం పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా మధిరలో మహిళలకు రూ.4 లక్షల విలువ చేసే రెండేసి పాడి గేదెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, అదే తరహాలో ఇక్కడా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ పాడి రైతులకు ఇచ్చేందుకు 3 వేల వరకు గేదెల అవసరమని గుర్తించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను పశుసంవర్థకశాఖ అధికారులు కూడా తయారు చేశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఇక్కడి మహిళలకు గేదెలు కూడా పంపిణీ చేయనున్నారు. డెయిరీ ఏర్పాటు మహిళల ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడటంతోపాటు పాడి పరిశ్రమ కూడా వృద్ధి చెందనుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
