కమ్యూనిస్ట్‌‌ పార్టీ విస్తరణకు కృషి జరగాలి

కమ్యూనిస్ట్‌‌ పార్టీ విస్తరణకు కృషి జరగాలి
  • మావోయిస్టులు అంతం కావచ్చు.. కానీ సిద్ధాంతం కాదు
  • సీపీఐ జాతీయ కంట్రోల్‌‌ కమిషన్‌‌ అధ్యక్షుడు నారాయ

ఖమ్మం, వెలుగు : ఉద్యమ ఖిల్లా అయిన ఖమ్మం నుంచే కమ్యూనిస్ట్‌‌ పార్టీ విస్తరణకు కృషి జరగాలని సీపీఐ జాతీయ కంట్రోల్‌‌ కమిషన్‌‌ అధ్యక్షుడు కె.నారాయణ పిలుపునిచ్చారు. సీపీఐ శత వసంత వేడుకల ముగింపు సభ డిసెంబర్ 26న జరగనున్న నేపథ్యంలో ఆదివారం ఖమ్మంలోని ఎస్‌‌ఆర్‌‌ గార్డెన్స్‌‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ... భారతదేశ చరిత్రలో ఖమ్మంకు ఓ ప్రత్యేక స్థానం ఉందన్నారు. 

ఆంధ్ర మహాసభ ద్వారా నైజాం పతనానికి నాంది పలికిన ఖమ్మంలో సీపీఐ శత వసంత వేడుకల ముగింపు సభ జరగడం అభినందనీయమన్నారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ, ఆ తర్వాత సామాజిక చైతన్యం కోసం జరిగిన ఏ పోరాటంతోనూ సంబంధం లేని వ్యక్తులు దేశభక్తులుగా చలామణి అవుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గవర్నర్లు ఆక్షేపిస్తున్నారని, ఇలాంటి వారు ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడుతారా ? అని ప్రశ్నించారు. 

12 మందిని చంపితే కానీ నిర్దోషిగా బయటకు రాలేని అమిత్‌‌ షా.. మావోయిస్టులను తుదముట్టిస్తామని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మావోయిస్టులు అంతం కావచ్చు కానీ.. ఆ సిద్ధాంతం అంతం కాదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, 
నాయకుడు పల్లా వెంకట్‌‌రెడ్డి మాట్లాడుతూ.. త్యాగాల చరిత్రతో కమ్యూనిస్టులు ముందుకు సాగుతుంటే,  స్వార్ధ చింతనతో అధికారమే లక్ష్యంగా ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ పని చేస్తోందన్నారు. సమావేశంలో నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు టీఎం.మూర్తి, పుదుచ్చేరి రాష్ట్ర కార్యదర్శి సలీం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేశ్‌‌ పాల్గొన్నారు.