ప్రెసిడెంట్ గారూ నన్ను కాపాడండి.. నేనేతప్పూ చేయలేదు

ప్రెసిడెంట్ గారూ నన్ను కాపాడండి.. నేనేతప్పూ చేయలేదు

కైరో: మానవ అక్రమ రవాణాకు పాల్పడినందుకు 20 ఏళ్ల అమ్మాయికి పదేళ్ల జైలు శిక్ష విధించింది ఈజిప్టు కోర్టు. హనీన్ హోస్సమ్ అనే ఆ అమ్మాయి టిక్‌టాక్ వీడియోలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆమెకు 9 లక్షలకు పైనే టిక్‌టాక్ ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ఈజిప్టు సామాజిక విలువలు, కట్టుబాట్లను ఉల్లంఘించినందుకు చట్టపరంగా అణచివేత ఎదుర్కొన్న పలువురు ప్రముఖుల్లో హనీన్‌ను ఒకరిగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్రమంగా మనుషుల రవాణాకు పాల్పడిందనే నేరానికి కోర్టు హనీన్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 

గతంలో కూడా సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడంపై వీడియోలు చేసినందుకు గానూ హనీన్‌కు కోర్టు 2 లక్షల ఈజిప్షియన్ పౌండ్లను జరిమానాగా విధించింది. కాగా, కైరో యూనివర్సిటీ విద్యార్థి అయిన హనీన్.. జైలు శిక్షపై కన్నీళ్ల పర్యంతమైంది. తనను ఆదుకోవాలని దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్ సిస్సీని కోరుతూ ఓ వీడియోను రూపొందించింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘మిస్టర్ ప్రెసిడెంట్ మీ బిడ్డ చనిపోబోతోంది. దేశ ప్రజలతోపాటు మీ సాయం నాకు కావాలి. నేనేం చేయలేను. నాకు అన్యాయం జరిగింది. నేనే తప్పూ చేయలేదు. దయచేసి నన్ను కాపాడండి. నా కేసులో తీర్పు విన్నాక మా అమ్మకు గుండె నొప్పి వచ్చింది’ అని హనీన్ వాపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.