
పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఇందిరాకాలనీ పెట్రోల్ బంకు వద్ద ఆర్టీసీ బస్సును ఓ టిప్పర్ ఢీకొనడంతో 8 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి మణుగూరు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును పెట్రోల్ బంకు నుంచి బయటకు వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బస్ డ్రైవర్ దాసరి శ్రీనివాసరావు కాలు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. కొత్తగూడానికి చెందిన జాడి ప్రసాద్, కోలా గురుమూర్తి, కట్టా శ్రీదేవి, అశ్వాపురానికి చెందిన ఎండీ ఆసిఫ్, పి సందీప్ కుమార్, మణుగూరుకు చెందిన భుక్యా బాలాజీ, పీవీ కాలనీకి చెందిన ఎన్ స్వామి గాయపడ్డారు. సీఐ నాగరాజు, ఎస్సై శ్రీనివాస్ బాధితులను పాల్వంచ దవాఖానాకు తరలించారు.
నల్గొండ జిల్లా చిట్యాలలో ‘ఆరెంజ్’ బస్సు బోల్తా
నార్కట్‌పల్లి : నల్గొండ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్బస్సు బోల్తా పడిన ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు 30 మందితో వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి స్టేజీ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని నార్కట్ పల్లిలోని కామినేని హాస్పిటల్ కు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివరాంరెడ్డి చెప్పారు.
రన్నింగ్ బస్సు నుంచి దూకిన ప్యాసింజర్..తీవ్ర గాయాలు
మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఎక్లాస్పూర్వద్ద రన్నింగ్ బస్సులో నుంచి దూకడంతో ఓ ప్యాసింజర్ తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్, కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని డిపోకు చెందిన బస్సు మంగళవారం గోదావరిఖని నుంచి భూపాలపల్లికి బయలుదేరింది. కాటారం మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మేకల దేవయ్య గోదావరిఖనిలో బస్సెక్కి బస్వాపూర్ కు టికెట్ తీసుకున్నాడు. మంథని బస్టాండ్ నుంచి బస్సు ఎక్లాస్పూర్ రాగానే కిందికి దూకాడు. తలకు బలమైన గాయాలు కావడంతో మంథని హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పెద్దపల్లి జిల్లా హాస్పిటల్కు అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు.