ఎనిమిదేళ్ల బాలికను కొట్టి చంపిన చిరుత

ఎనిమిదేళ్ల బాలికను కొట్టి చంపిన చిరుత

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌ అటవీ ప్రాంతంలో చిరుతపులి ఓ ఎనిమిదేళ్ల బాలికను కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది. తల్లితో కలిసి గడ్డి కోసేందుకు అడవికి వెళ్లిన బాలికను చిరుత దాడి చేసి హతమార్చింది. తోటి మహిళలు పెద్దఎత్తున కేకలు వేయడంతో క్రూర జంతువు  పాపను వదిలేసి అడవిలోకి పారిపోయింది.   

ఈ విషాద ఘటనపై దంపూర్‌లోని నాయబ్ తహసీల్దార్ వివేక్ తివారీ మాట్లాడుతూ.. మండోరి గ్రామానికి చెందిన సునీత తన ఎనిమిదేళ్ల కుమార్తె దివ్యాన్షి(8), ఇతర మహిళలతో కలిసి శనివారం(జులై 13) సాయంత్రం కలిసి గడ్డి కోసేందుకు అడవికి వెళ్లినట్లు తెలిపారు. బాలిక ఆడుకుంటున్న సమయంలో చిరుతపులి దాడి చేసిందని తెలిపారు. ఇతర మహిళలు పెద్దఎత్తున కేకలు వేయడంతో చిరుతపులి అక్కడి నుంచి పారిపోయిందని వివరించారు. గాయపడిన బాలికను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు  నిర్ధారించారని తెలిపారు.

రెండు రోజుల్లో రెండు ప్రాణాలు

గడిచిన 48 గంటల్లో ఇది రెండో ఘటన. శుక్రవారం(జులై 12) జిల్లాలోని కతర్నియాఘాట్ వన్యప్రాణి డివిజన్ సోమైగౌర్హి గ్రామంలో చిరుతపులి దాడిలో ఓ 14 ఏళ్ల బాలుడు మరణించాడు. బాలుడు అరవింద్ కుమార్ తన కుటుంబంతో కలిసి మొక్కజొన్న పొలానికి కాపలాగా వెళ్లిన సమయంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో చిరుతపులి దాడి చేసి హతమార్చింది. సమీపంలో ఉన్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు చిరుతను చుట్టుముట్టడంతో యువకుడిని వదిలి అడవి వైపు వెళ్లింది. బాలుడిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.