మహారాష్ట్రలో కేబినెట్‌ విస్తరణ.. బీజేపీకి పెద్ద పీట..?

మహారాష్ట్రలో కేబినెట్‌ విస్తరణ.. బీజేపీకి పెద్ద పీట..?

ముంబై : మహారాష్ట్రంలో ఏక్ నాథ్ షిండే సర్కార్ కేబినెట్ విస్తరణపై సీరియస్ గా ఫోకస్ చేసింది. 45 మంది మంత్రులతో నూతన కేబినెట్‌ను సీఎం షిండే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త కేబినెట్‌లో బీజేపీకి చెందిన వారు 25 మంది ఎమ్మెల్యేలు, షిండే అనుచర ఎమ్మెల్యేల్లో (శివసేన ఎమ్మెల్యేలు)13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక, స్వతంత్రులకు కూడా కేబినెట్‌లో స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీరిలో సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ మినహా అందరూ కొత్తవారేనని సమాచారం. 

కేబినెట్ విస్తరణ విషయంలో సీఎం ఏక్‌నాథ్‌ షిండే, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారమే శివసేనలోని ప్రతీ ముగ్గురు ఎమ్మెల్యేలకు, బీజేపీలో ప్రతీ నలుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై జులై 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో కీలకమైన రెవెన్యూ, హోంశాఖలను బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు మంత్రివర్గ కూర్పుపై షిండే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. 

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనంతరం.. శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే.. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన షిండే
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో షిండే బాధ్యతలు తీసుకున్నారు.