దేశంలోనే అతిపెద్ద ఏక శిలా గణపతి విగ్రహం దుందుభి నది తీరంలో ఉంది. ఇది పశ్చిమ చాళిక్యుల కాలం నాటి పురాతన రాతి విగ్రహం. పచ్చని పంట పొలాల మధ్య భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. భారీ లంభోదరుడుగా ఆవంచ ఐశ్వర్య గణపతి పూజలందుకుంటున్నాడు.
దేశంలోని అతిపెద్ద వినాయకుడిగా
దేశంలోని అతిపెద్ద వినాయకుడిగా నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల పరిధిలోని ఆవంచ ఐశ్వర్య గణపతి ప్రసిద్ధికెక్కాడు. దుందుభి నది తీరంలోని లంబోదరుడు ఐశ్వర్య గణపతిగా, గుండు గణపతిగా ప్రఖ్యాతి చెందాడు. శ్రావణ బెళగొళలోని గోమటేశ్వరుడు, చాముండీ కొండపై నందీశ్వరుడు, ఆవంచలోని వినాయకుడు అతిపెద్ద రాతి విగ్రహాలుగా కీర్తింపబడుతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 24 అడుగుల ఏకశిలా ఐశ్వర్య గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నది. క్రీ.శ 1140లో తైలపుడు అనే రాజు 24 అడుగుల ఎత్తు ఉన్న శిలకు శిల్పులతో గణపతి ఆకారాన్ని చెక్కించాడని పురాణాలు చెబుతున్నాయి.
గణపతి ప్రతిమ నిర్మాణంలో ఉన్న సమయంలోనే తన తండ్రి విక్రమాదిత్యుడు చనిపోయాడనే వార్త తెలుసుకున్న తైలపుడు మధ్యలోనే వెళ్లిపోయినట్లు, తిరిగి రానట్లు తెలుస్తోంది. దీంతో విగ్రహ నిర్మాణ పనులు, దేవాలయం పూర్తి కాలేదు. దుందుభి నది ఒడ్డున ఊరికి దూరంగా వెలసిన ఐశ్వర్య గణపతి ఆలయ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, గ్రామస్థులు గతంలో నిర్ణయించారు. అదే గ్రామానికి చెందిన రఘుపతిరెడ్డి అనే వ్యక్తి తన రెండెకరాల పొలాన్ని దానం చేశారు. ఆలయ నిర్మాణ విషయమై పలు సేవా ట్రస్టులు వచ్చినట్లే వచ్చి మళ్లీ రాలేదు.
ఏళ్లుగా ఆలయ నిర్మాణం జరగటం లేదు
గతంలో మహారాష్టల్రోని మహాలక్ష్మి సేవా ట్రస్ట్, ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు విషయం తెలుసుకొని గ్రామానికి వచ్చి పెద్ద ఎత్తున ఐశ్వర్య గణపతికి పూజలు, హోమాలు నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆలయ నిర్మాణానికి దాదాపు 10 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని, ఇంకా స్థలాన్ని కొనుగోలు చేయాలని అంచనాలు వేశారు. కానీ ఏళ్లుగా ఆలయ నిర్మాణం జరగటం లేదు. నిర్మాణం పూర్తి కాకపోయినా గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ భారీ గణనాథుడికి వినాయకచవితి రోజు ప్రత్యేక పూజలు చేస్తారు.
అయితే ఏళ్లు గడుస్తున్నా గుడి నిర్మాణానికి విఘ్నాలు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. సకల జనుల విఘ్నాలను తొలగించి భక్తుల బాధలు దూరం చేసే వినాయకుడి ఆలయానికి విఘ్నాలు తొలగి ఆలయ నిర్మాణం జరగాలని గ్రామస్థులు కోరుతున్నారు. పురావస్తుశాఖ గుర్తించి చారిత్రక సంపదను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
