కార్పొరేట్లకు దీటుగా ఏకలవ్య స్కూళ్లు : ఎంపీ రామ రఘురాం రెడ్డి

కార్పొరేట్లకు దీటుగా ఏకలవ్య స్కూళ్లు :  ఎంపీ రామ రఘురాం రెడ్డి
  •     ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి 

ములకలపల్లి, వెలుగు : ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల విద్యాభివృద్ధి కోసం నిర్మించిన ఏకలవ్య స్కూళ్లు అన్ని హంగులతో కార్పొరేట్లకు దీటుగా ఉన్నాయని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. శనివారం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏకలవ్య స్కూళ్ల ను వర్చువల్ గా ప్రారంభించారు. 

ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ఎంపీ రఘురామిరెడ్డి మూకమామిడిలో నూతనంగా నిర్మించిన ఏకలవ్య స్కూల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గిరిజనులను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు రూ.33 కోట్లతో ఏకలవ్య స్కూల్ ని నిర్మించినట్లు తెలిపారు. 

విద్యార్థులు ఆహ్లాద వాతావరణంలో చదువుకునేలా మూకమామిడి ప్రాజెక్టు సమీపంలో స్థలాన్ని సేకరించి నిర్మాణానికి పాటుపడ్డ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అభినందించారు. అనంతరం బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

మూకమామిడి ప్రాజెక్ట్ ను ఎమ్మెల్యే తో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టును మినీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఎంపీని కోరారు.   

                                                                                                                        
మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి 

ఖమ్మం టౌన్ :  మహాత్మా గాంధీ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఎంపీ రఘురాంరెడ్డి పిలుపునిచ్చారు.  స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వందేమాతరం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి సంతోష్, గ్లోబల్ ఫ్యామిలీ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి ల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 1,156 విగ్రహాల ప్రదర్శన, 156 చరకాల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కళాశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీ విజేతలను సత్కరించారు. ఎంపీ వెంట కాంగ్రెస్ రాష్ట్ర యువ నేత తుమ్మల యుగంధర్, జిల్లా నాయకులు ఉన్నారు.