మల్టీ లేయర్ ప్లాస్టిక్.. అంటే చిప్స్, మ్యాగీ, మసాలా ప్యాకెట్లు, ఇతర ఫుడ్ ర్యాపర్స్ అన్నమాట. ప్రపంచంలో ఉన్న నలభై శాతం ప్లాస్టిక్ వేస్ట్‌కి ఇవే కారణం. ప్లాస్టిక్ వేస్ట్ పెరగడానికి రెండో అతి పెద్ద రీజన్ కూడా ఫుడ్ ప్యాకేజింగ్. ఈ వేస్టేజ్‌ని తగ్గించాలంటే ఇంట్లో ఉన్న పప్పు, ఉప్పు ప్యాకెట్లు అన్నింటినీ ‘ఎకోకారి–హ్యూమనైజింగ్ ఫ్యాషన్’ వాళ్లకి ఇచ్చేయాలి. అవి వాళ్లేం చేసుకుంటారు అంటున్నారా? వాటితో రంగురంగుల హ్యాండ్ బ్యాగులు, యాక్సెసరీస్ తయారుచేస్తారు. అది కూడా మగ్గం మీద. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! అసలు ఇది ఎలా మొదలైందంటే..
చిప్స్, కుకీస్, డిటర్జెంట్ ప్యాకెట్లని.. ఫ్యాబ్రిక్‌గా మార్చాలన్న ఈ ఆలోచన వెనకున్నది నందన్ భట్. నెలకు 20 మిలియన్ల ప్లాస్టిక్ ఫుడ్ ప్యాకెట్లతో బ్యాగులు చేస్తున్న ఇతని బాల్యం జమ్మూ– కశ్మీర్‌లోని చందర్హామాలో గడిచింది. అక్కడ చుట్టూ పర్వతాలే ఉండటంతో ట్రెక్కింగ్‌పై తెలియని ఇష్టం కలిగింది నందన్‌కి. ఆ తర్వాత చదువు కోసం పుణె వెళ్లినా.. అతని మనసంతా తన ఊళ్లోని పర్వతాల చుట్టూనే తిరుగుతుండేది. ప్రపంచమంతా తిరిగి ట్రెక్కింగ్ చేయాలనుకునేవాడు. అలాగే ఎంట్రప్రెనూర్‌గా రాణించాలనుకునేవాడు. కానీ, కుటుంబ బాధ్యతలు ఆ కలలకి అడ్డుపడ్డాయి. దాంతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరాడు. అయితే మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఉండటంతో ఉద్యోగంలో భాగంగా చాలా ప్లేస్‌లకి తిరిగాడు నందన్. అప్పుడే రోడ్లు, కొండ ప్రాంతాలు, పచ్చని చెట్ల మధ్య కుప్పలుగా ప్లాస్టిక్ ప్యాకెట్లు పడి ఉండటం చూశాడు. అది చాలా బాధపెట్టింది అతడ్ని. దాన్నుంచే ప్లాస్టిక్ వేస్ట్‌తో... మగ్గం మీద బ్యాగులు తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. దాంతో 2013లో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు.
కొన్నేండ్లకే మూతపడింది
నందన్‌తో పాటు కార్పొరేట్లో పనిచేసిన అమితా దేశ్‌పాండే కూడా చేతులు కలిపింది. ఇద్దరూ కలిసి రెండేండ్లు గ్రౌండ్ వర్క్ చేసి, ఆరోహణ ఎకో– సోషల్ డెవలప్‌మెంట్‌ని మొదలుపెట్టారు. ప్లాస్టిక్ వేస్ట్‌తో స్టైలిష్ హ్యాండ్ బ్యాగులు తయారుచేయడానికి కొందరు ఆడవాళ్లని కలిశారు. వాళ్లకి మగ్గం వర్క్ నేర్పించి.. వేస్ట్‌ని ఫ్యాబ్రిక్‌గా మార్చే పని అప్పజెప్పారు. కానీ, ఏడేండ్లు టైం, డబ్బు ఇన్వెస్ట్ చేసినా ఆ ఐడియా వర్కవుట్ కాలేదు. దాంతో 2020 లో ఆ బిజినెస్‌ని పూర్తిగా మూసేయాల్సి వచ్చింది. అయినా సరే వెనక్కి తగ్గలేదు నందన్. తన ఫెయిల్యూర్‌కి కారణాల్ని వెతికాడు. వాటిని సరిచేసుకుంటూ.. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో ఎకోకారిని మొదలుపెట్టాడు. ఇద్దరు చేనేత కార్మికులతో మొదలైన అతని జర్నీ ఇప్పుడు దేశాలు దాటింది. ఎకోకారి ప్రొడక్ట్స్‌కి ఆస్ట్రేలియా, దుబాయ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, సింగపూర్, యు. కె., యూఎస్ఏ లాంటి దేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది.
ఇలా తయారుచేస్తారు
చిప్స్, బిస్కెట్స్, మసాలాలు, పప్పు దినుసుల వాడి పడేసిన ప్లాస్టిక్ కవర్లను కలెక్ట్ చేస్తారు. వాటిని శుభ్రంగా కడిగి, శానిటైజ్ చేస్తారు. ఆ తర్వాత కత్తెరతో కట్ చేసి వాటిని రాట్నంలో తిప్పి దారం తీస్తారు. ఆ దారంతో మగ్గం మీద ఫ్యాబ్రిక్ నేస్తారు. అలా తయారుచేసిన ఫ్యాబ్రిక్‌తో డిజైనర్స్, టైలర్స్ కలిసి రంగురంగుల హ్యాండ్ బ్యాగులు, యాక్సెసరీస్, హోం డెకరేషన్ ఐటమ్స్, ఆఫీస్ స్టేషనరీ తయారుచేస్తారు. మన దగ్గరున్న ప్లాస్టిక్ ప్యాకెట్లని కూడా ఎకోకారి. కామ్ ద్వారా వీళ్లకి డొనేట్ చేయొచ్చు. వేస్ట్‌గా పడేసే ప్లాస్టిక్‌తో వాడుకునేలా బ్యాగ్స్ తయారుచేస్తున్నారు. కానీ, రీసైకిల్ చేసి వాడినా కూడా ప్లాస్టిక్ వాడటం పర్యావరణానికి అంత మంచిదేం కాదు.
నా మొదటి స్టార్టప్ ఫెయిల్ అయింది. ఆ రిజల్ట్ మానసి కంగా, ఆర్థికంగా నన్ను చాలా దెబ్బతీసింది. అలాగని అక్కడితో ఆగిపోవాలనుకోలేదు నేను. పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టు అక్కడే మళ్లీ పరిగెత్తి గెలవాలనుకున్నా. ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఎకోకారి ప్రొడక్ట్స్‌ని రిటైల్ స్టోర్స్‌కి తీసుకురావాలి అనుకుంటున్నా. ప్లాస్టిక్ వేస్ట్‌తో మరిన్ని ప్రయోగాలు చేయాలను కుంటున్నా అంటున్నాడు నందన్.
