మార్నింగ్ వాక్ కు వెళ్తుండగా ఎద్దు దాడి.. వృద్ధుడు మృతి

మార్నింగ్ వాక్ కు వెళ్తుండగా ఎద్దు దాడి.. వృద్ధుడు మృతి

ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న విచ్చలవిడి పశువుల దాడులు అక్కడి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ జంతువుల హింసాత్మక దాడుల్లో చాలా మంది తీవ్రంగా గాయపడుతున్నారు, అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినప్పటికీ ఈ సమస్యకు ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం కనుగొనలేకపోయింది. తాజాగా ఇదే తరహా ఘటన మరొకటి చోటుచేసుకుంది. విచ్చలవిడిగా సంచరిస్తోన్న ఎద్దుల దాడిలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బరేలీలో చోటుచేసుకుంది.

బుధవారం (జనవరి 24) ఉదయం 8 గంటలకు వృద్ధుడు మార్నింగ్ వాక్ కోసం తన ఇంటి నుండి బయలుదేరాడు. ఆ వ్యక్తి ఇంటి నుండి కొన్ని అడుగులు రాగానే.. అప్పుడు అక్కడే విచ్చలవిడిగా తిరుగుతోన్న ఓ ఎద్దు ఆ వ్యక్తిపై దాడి చేసింది. ఈ దాడిలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బరేలీ సమీపంలోని సంజయ్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరగగా, ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ విషాద ఘటన రికార్డయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ వ్యక్తిని ఎద్దు చంపినట్లు ఈ వీడియోలో చూడవచ్చు. సీసీటీవీ ఫుటేజీలో అతను ఓ సందులో నడుస్తున్నట్లు, అతని వైపుగా రెండు ఎద్దులు వస్తున్నట్లు కనిపిస్తుంది. అనంతరం అతనిపై ఎద్దులు దాడి చేశాయి. ఈ క్రమంలోనే ఎద్దు ఆ వ్యక్తి పొట్టపై కొమ్ములతో దాడి చేయడంతో.. ఆ తాకిడికి అతను తట్టుకోలేకపోయాడు. అతను కింద పడిన తర్వాత కూడా ఎద్దు అతనిపై దాడి చేస్తూనే ఉంది. ఈ సమయంలో ఆ వృద్ధుడిని రక్షించేందుకు ఆ ప్రాంతంలో ఎవరూ లేరు. కాసేపటికి ఎద్దు మనిషిని దాడి చేయడం చూసిన జనం దాన్ని తరిమేశారు. బాధితుడిని కృష్ణానంద్ పాండే (75)గా గుర్తించారు. అతను సెంట్రల్ స్టేట్ కాలనీలో నివసిస్తున్నాడు. చక్కెర మిల్లులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.

ఎద్దు ఆ ప్రాంతంలో అనేక మందిని గాయపరిచింది. ఇటీవల అది ఒక పిల్లవాడిపైనా దాడి చేసింది. అదృష్టవశాత్తూ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ తాజాగా జరిగిన ఈ దాడిలో వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. దాడి చేసిన ఎద్దుపై ఫిర్యాదు అందుకున్న అధికారులు చర్యలు చేపట్టి దాన్ని పట్టుకునేందుకు బృందాన్ని పంపారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఎద్దు మెడకు తాడు బిగించడం వల్ల అది చనిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.