
మెదక్, వెలుగు: తన పిల్లల అనారోగ్యం కారణంగా డబ్బులు అవసరం ఉండి ఓ వ్యక్తికి తాకట్టు పెట్టిన 4.28 ఎకరాల భూమిని తన అనుమతి లేకుండా అక్రమంగా పట్టా చేసుకున్నాడని, అతడిపై చర్యలు తీసుకొని తన భూమి తనకు ఇప్పించాలని ఓ గిరిజన వృద్ధురాలు అధికారులను వేడుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన లకావత్ రుక్మిణికి 4 ఎకరాల 28 గుంటల లావాణి భూమి ఉంది. తన పిల్లల అనారోగ్యం కారణంగా వారికి చికిత్స చేయించేందుకు డబ్బులు అవసరం అయి అదే గ్రామానికి చెందిన శ్రీశైలం వద్ద భూమిని తాకట్టు పెట్టి రూ.50 వేలు తీసుకుంది.
ఆ పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లను అతడికి ఇచ్చింది. ఇదే అదునుగా భావించిన శ్రీశైలం ఆ భూమిని అతడి భార్య పేరు మీద పట్టా చేయించుకున్నాడని రుక్మిణి ఆరోపించింది. ఈ విషయంలో విచారణ జరిపి తన భూమి తనకు ఇప్పించాలని సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో డీఆర్వో భుజంగరావుకు మొరపెట్టుకుంది. ఈ విషయంపై తన కొడుకు లక్ష్మణ్ ఆఫీస్ ల చుట్టూ తిరిగి తిరిగి మనస్తాపం చెంది మృతి చెందాడని బోరున విలపించింది. తన అనుమతి లేకుండా పట్టా పొందిన వ్యక్తి పై చర్యలు తీసుకొని తన భూమి తనకి ఇప్పించాలని ఆ వృద్ధురాలు కోరుతోంది.
ఫిర్యాదులను పెండింగ్లో పెట్టొద్దు: కలెక్టర్
సిద్దిపేట టౌన్: ప్రజావాణిపై పెట్టుకున్న నమ్మకాన్ని అధికారులు వమ్ము చేయవద్దని కలెక్టర్మనుచౌదరి సూచించారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టర్ఆఫీసులో అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, ఇతర శాఖల అధికారులతో కలిసి వినతులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 69 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ వో నాగరాజమ్మ, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.